తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 17,580 మంది సీనియర్ సిటిజన్లు.. 23,919 మంది వికలాంగులకు అధికారులు ఫారం అందించారు. ఫాం 12 (డీ) ప్రకారం జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ఇంటి నుంచే ఓటు వేసేందుకు వీలు కలుగుతుంది.
ఎన్నికల్లో ఓటింగ్ పెంచడంతో పాటు వినూత్న సంస్కరణలు తీసుకొస్తూ ముందుకు సాగుతోంది భారత ఎన్నికల సంఘం. ఇంతపెద్ద దేశంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాల మన్ననలను పొందుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 80 ఏళ్లకు పైబడిన వృద్ధులకు, 40 శాతం కంటే పైగా అంగవైకల్యం వున్న వారికి ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 17,580 మంది సీనియర్ సిటిజన్లు.. 23,919 మంది వికలాంగులకు అధికారులు ఫారం అందించారు. ఫాం 12 (డీ) ప్రకారం జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ఇంటి నుంచే ఓటు వేసేందుకు వీలు కలుగుతుంది.
బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 889 మంది వృద్ధులు, 858 మంది వికలాంగులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫారం 12 (డీ)ని సమర్పించారని చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వివరాలను కలెక్టర్ తెలియజేస్తూ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 833 ప్రాంతాల్లో 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లు వున్నాయని కలెక్టర్ చెప్పారు.
ర్యాండమైజేషన్ ద్వారా 1778 మంది పోలింగ్ అధికారులు, 1774 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, 3599 మంది ఇతర పోలింగ్ అధికారులు సహా మొత్తం 7151 మంది పోలింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు . జిల్లాలో బుధవారం వరకు 34 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. వాహన తనిఖీల్లో రూ.89,400,799 విలువైన మద్యం రూ. 3.80 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు 78.45 లక్షల విలువైన ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ వెరిఫికేషన్ అనంతరం రూ.2.39 కోట్లను నిజమైన యజమానులకు తిరిగి ఇచ్చామని తెలిపారు.