కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై కేసీఆర్ కేంద్రీకరించారు. కామారెడ్డి నేతలతో కేసీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
కామారెడ్డి: గ్రూప్ తగాదాలను విడనాడాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కామారెడ్డి నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ విషయాలపై కేసీఆర్ మండిపడ్డారు.
గురువారంనాడు గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కామారెడ్డికి ప్రత్యేక హెలికాప్టర్ లో కేసీఆర్ చేరుకున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య గ్రూప్ తగాదాల విషయమై కేసీఆర్ ప్రస్తావించారు. ఈ పరిణామాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో స్థానికంగా కొందరు నేతలు విబేధిస్తున్నారు. పార్టీలో రెండు వర్గాలు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ పరిణామాలు పార్టీని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశాయి. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు. కేసీఆర్ పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాత కూడ ఈ పరిస్థితులో మార్పు రాలేదు. ఈ విషయమై మీడియాలో కథనాలు వచ్చాయి.
పార్టీకి చెందిన కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాలపై కేసీఆర్ పార్టీ నేతలను నిలదీశారు. పార్టీ క్రమశిక్షణను ఎవరూ కూడ ఉల్లంఘించవద్దని ఆయన కోరారు. పార్టీ లైన్ దాటితే ఉపేక్షించబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు.
గజ్వేల్ తో పాటు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుండి కేసీఆర్ ఈ దఫా పోటీ చేస్తున్నారు. కేసీఆర్ పూర్వీకులు ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో నివాసం ఉండేవారు. దీంతో ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని గంపగోవర్ధన్ కేసీఆర్ ను కోరారు. దీంతో ఈ నియోజకవర్గం నుండి కేసీఆర్ బరిలోకి దిగుతున్నారని పార్టీ వర్గాలు పైకి చెబుతున్నా అంతర్గతంగా మాత్రం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్టీ బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా కేసీఆర్ ఈ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారనే చర్చ కూడ లేకపోలేదు.