చెన్నూరు, పరకాల నామినేషన్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత.. కారణమేంటంటే...

By SumaBala Bukka  |  First Published Nov 9, 2023, 1:28 PM IST

గురువారం పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఈ రోజు నామినేషన్లు వేశారు.


పరకాల : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు రేపటితో  ముగియనుంది. అన్ని పార్టీల అభ్యర్థులు నేడు నామినేషన్లు పెద్ద ఎత్తున వేస్తున్నారు. ఈ క్రమంలో రెండుచోట్ల నామినేషన్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. హనుమకొండలోని పరకాలలో ఉన్న నామినేషన్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకోగా..  చెన్నూరులోని నామినేషన్ కేంద్రం దగ్గర కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఈ రెండు చోట్ల ఉద్రిక్తతలకు కారణం అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ కేంద్రాలకు చేరుకోవడమే. చెన్నూరులో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఒకేసారి ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. దీంతో ఇరువైపులా అభ్యర్థుల అనుచరులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో గందరగోళం నెలకొంది. ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు జోక్యం చేసుకున్నారు. 

Latest Videos

అంబులెన్స్ లో వెళ్లి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్...

ఇక పరకాలను కూడా నామినేషన్ కేంద్రానికి కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి, టిఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఒకేసారి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురెదురు పడడంతో పరస్పర నినాదాలు చేసుకుంటూ.. తమ అభ్యర్థులకు జై కొడుతూ హోరెత్తించారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. పోలీసులు కలగజేసుకొని రెండు చోట్ల కూడా ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టారు. కాసేపటికి పరిస్థితి సద్దుమణిగింది.

ఇకపోతే.. నేడు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్  గజ్వేల్,  కామారెడ్డి రెండు చోట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి  భట్టి విక్రమార్కలు కూడా  తమ తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. 

click me!