వరంగల్‌ ఓఆర్‌ఆర్‌ ల్యాండ్‌ పూలింగ్‌ రద్దు.. రైతుల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

Published : May 31, 2022, 09:38 AM IST
వరంగల్‌ ఓఆర్‌ఆర్‌ ల్యాండ్‌ పూలింగ్‌ రద్దు.. రైతుల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

సారాంశం

వరంగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) కోసం ప్రతిపాదించిన ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ (భూసమీకరణ) పద్ధతిలో భూములను సేకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 

వరంగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) కోసం ప్రతిపాదించిన ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 41 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ (భూసమీకరణ) పద్ధతిలో భూములను సేకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వరంగల్ ఓఆర్‌ఆర్ కోసం.. భూ యజమానుల అనుమతి కోరుతూ 2022 ఏప్రిల్ 30న జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 

వరంగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 28 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో వరంగల్ జిల్లాలోని 15గ్రామాలు, హన్మకొండలోని 10, జనగామలోని 3 గ్రామాలు ఉన్నాయి. అయితే ఆయా గ్రామాల పరిధిలో సర్వే పనులు అక్కడి రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. భూ సమీకరణకు అంగీకరించేది లేదని ఆందోళన బాట పట్టారు. ల్యాండ్ పూలింగ్ కు భూ యజమానుల సమ్మతి కోసం తెచ్చిన జీవో 80 ఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేపట్టారు. ఇటీవల ఆరెపల్లి గ్రామం నుంచి నస్కల్ వరకు జాతీయ రహదారి-163పై రైతులు ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష పార్టీలు కూడా రైతుల నిరసనలకు మద్దతుగా నిలిచాయి.

ల్యాండ్‌పూలింగ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ ఆదివారం మధ్యాహ్నం మంత్రి కేటీఆర్‌తో సమావేశమై చర్చించారు. ఈ క్రమంలోనే ల్యాండ్‌ పూలింగ్‌ విధానానికి స్వస్తి పలకాలని అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం. దీంతో వరంగల్ ఓఆర్‌ఆర్ ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు అర్వింద్‌కుమార్‌ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.  

ఈ నిర్ణయంపై మూడు జిల్లాల్లోని 28 గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇది రైతుల విజయమని, తమ పోరాటాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్తించిందని పలువురు రైతులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే