ప్రాచీన నగరం, ఐటీ సిటీ... హైదరాబాద్ కు వున్న ఈ పేర్లు చాలు ఈ నగర విశేషమైన చరిత్రను, అభివృద్దిని తెలియజేస్తాయి. ఇలాంటి నగరంలో ఇటీవల పబ్ కల్చర్ పెరిగిపోయి అశ్లీలత తాండవిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అశ్లీలతను ప్రేరేపించి యువతీ యువకులను ముగ్గులోకి దించి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు దుండుగులు. దీన్ని పబ్ కల్చర్ అంటూ కలరింగ్ ఇస్తూ అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఇటీవల బంజారాహిల్స్ రాడిసన్ హోటల్లోని పుడ్డింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ దొరకడంతో తీవ్ర దుమారం రేగింది. ఇక నిన్న సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలోని టెకిలా పబ్ వ్యవహారంప బయటపడింది. ఇది మరిచిపోకముందే మరో హోటల్లో యువతీ యువకులతో అశ్లీల నృత్యాలతో ప్రేరేపిస్తూ సాగుతున్న పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసారు.
సికింద్రాబాద్ లోని బసేరా హోటల్లో నడుస్తున్న ఓ పబ్ పై అనుమానం రావడంతో స్థానిక గోపాలపురం పోలీసులు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆ పబ్ పై నిఘా పెట్టారు. దీంతో పబ్ లో అశ్లీల నృత్యాలు జరుగుతున్నట్లు గుర్తించిన టాస్క్ ఫోర్స్ బృందం ఒక్కసారిగా దాడిచేసి యువతులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
undefined
Video
పబ్ నిర్వహకులు యువకులను ఆకట్టుకునేందుకు ఇలా యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పబ్ కు వచ్చే యువకుల నుండి అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారట. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సదరు పబ్ పై టాస్క్ ఫోర్స్ దాడులు జరిగాయి. మహిళా పోలీసుల సాయంతో పదిమంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వహకులపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇక మొన్నటికి మొన్న (శనివారం రాత్రి) ఇదే సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట్‌లోని టెకీలా పబ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహిస్తున్నట్లుగా ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ పబ్‌పై దాడలు చేశారు. పోలీసులు దాడులు చేసిన సమయంలో పబ్‌లో యువతులు అశ్లీల నృత్యాలు గుర్తించారు. యువతులతో అశ్లీల నృత్యాలు, లేట్ నైట్ న్యూసెన్స్ నేపథ్యంలో పోలీసులు 18 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 8 మంది డ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్ ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై ఆకస్మిక దాడులు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. నగరంలోకి బడాబాబుల పిల్లలు, టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం లేట్ నైట్ వరకు నడుస్తున్న ఈ పబ్ లో పట్టుబడ్డారు. అంతేకాదు దాడుల సమయంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదు గ్రాముల కొకైన్‌ను ఈ పబ్ నుండి స్వాధీనం చేసుకోవడం మరింత దుమారం రేపింది.
దాడి సమయంలో పబ్‌లో సిబ్బందితో సహా దాదాపు 150 మంది ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. పబ్‌లో జరిగిన లేట్ నైట్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు బంధువులు, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలోనే రాడిసన్ హోటల్, పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లైసెన్సులను రద్దు చేశారు.