
ఇదేంటి ఒక్క కెటిఆర్ కు రెండు బైక్ కథలు ఏంటి? అసలు కేటిఆర్ కు బైకులకు సంబంధం ఏమన్నా ఉందా? అనుకుంటున్నారా? ఈ వార్త మొత్తం చదివితే మీకే అర్థమవుతుంది.
తెలంగాణ మంత్రివర్గంలో కీలక వ్యక్తి, సిఎం తనయుడు కెటిఆర్ ఇటీవల ఒక వివాదంలో లోతుగా ఇరుక్కుపోయారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, కెటిఆర్ మధ్య హాటు, ఘాటు మాటల తూటాలు కూడా పేలాయి. అయినా కెటిఆర్ ఆ వివాదం నుంచి ఇంకా బయటపడినట్లు లేదు. అదేమంటే కెటిఆర్ తనయుడి పేరుతో ఉన్న హిమాన్సు మోటార్స్ కు తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వాహనాల సరఫరా అప్పగించిందని, ఎలాంటి టెండర్లు లేకుండానే సదరు సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చిందన్నది కాంగ్రెస్ ఆరోపణ. మొన్నటి ఎన్నికల వరకు కూడా కెటిఆర్ హిమాన్స్ మోటార్స్ డైరెక్టర్ గా ఉన్నారు. కానీ ఏడెనిమిదేళ్ల కిందటే ఆయన తాను ఆ సంస్థ నుంచి తప్పుకున్నానని కెటిఆర్ చెప్పారు. కాంగ్రెస్ ఆధారాలు కూడా చూపింది. దీంతో కెటిఆర్ బైక్ ల కంపెనీకి తెలంగాణ సర్కారు నిబంధనలకు నీళ్లొదిలి మేలు చేకూర్చిందన్నది ఆరోపణ. ఇది కెటిఆర్ ఒక బైక్ స్టోరీ.
ఇక రెండో బైక్ స్టోరీ అంటారా? కెటిఆర్ బర్త్ డే నాడు ఆయన సోదరి, నిజామాబాద్ ఎంపి కవిత సిస్టర్ ఫర్ చేంజ్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేమంటే రాఖీ పండుగ రోజున రాఖీ కట్టడంతోపాటు తమ సోదరులకు ఒక హెల్మెట్ కూడా అందజేయాలన్నది ఆ కార్యక్రమం కాన్సెప్ట్. దసరా నాడు కెటిఆర్ కు రాఖీ కట్టడంతోపాటు ఒక హెల్మెట్ ను కెటిఆర్ కు అందజేయనున్నారు కవిత. అలాగే ఆరోజు కవిత ఎంతమందికి రాఖీ కడతారో వారందరికీ హెల్మెట్ లు అందించేందుకు జాగృతి ప్లాన్ చేస్తోంది. మనకొక డౌట్ రావొచ్చు. మంత్రి కెటిఆర్ బైక్ నడుపుతారా? ఆయన బైక్ మీద తిరగరు కానీ హెల్మెట్ ఎందుకిస్తున్నారు కవిత అనే డౌట్ వస్తది. నిజానికి కెటిఆర్ బైక్ నడిపే చాన్సే లేదు. కాకపోతే ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేయడం కోసం తానే స్వయంగా ఆచరిస్తానని కవిత చెప్పారు. అంతేకాకుండా కెటిఆర్ కు హెల్మెట్ తో పాటు బైక్ కూడా కొనిస్తానని ఆమె ఇప్పటికే సదరగా వ్యాఖ్యానించారు కూడా.
ఇదండీ ఒక్క కెటిఆర్ రెండు బైక్ ల కథ.