
ఆ పోలీసు విచక్షణ కోల్పోయిండు. రెచ్చిపోయిండు. ఆడపిల్ల అని చూడకుండా క్రౌర్యం ప్రదర్శించిండు. విద్యార్థినిని గిచ్చిండు. ఇంత నీచానికి ఒడిగట్టిన పోలీసుది కరీంనగర్ జిల్లా. ఆ విద్యార్థినిది కూడా కరీంనగర్ జిల్లానే. వివరాలిలా ఉన్నాయి.
రెండు రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విద్యారంగ సమస్యలపై చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చింది. దీంతో వందలాది మంది విద్యార్థులు కరీంనగర్ కలెక్టరేట్ ను ముట్టడించిర్రు. ఆ సమయంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సుమారు 400 మందికి పైగా విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. అదే సమయంలో ఓ విద్యార్థినిని నిలువరించేందుకు ఒక పోలీసు తన చేతికి పని చెప్పిండు. ఆ ఆడపిల్లను గిచ్చిండు. అసలు మహిళా ఆందోళనకారులను మహిళా పోలీసులు మాత్రమే హాండిల్ చేయాలని చట్టాలు చెబుతున్నాయి. అదేమీ పట్టించుకోలేదు ఆ పోలీసోడు. ఆడపిల్ల మీద చేయి వేసి గిచ్చి బెదిరించిండు.
మొన్నటికి మొన్న మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా చేయి పట్టున్నాడని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై సభ్య సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ అధికారులంతా ఆందోళణ చేశారు. సిఎం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తుదకు శంకర్ నాయక్ భేషరతు క్షమాపణ చెప్పిండు. అయినప్పటికీ శంకర్ మీద పోలీసు కేసు నమోదైంది.
అలాగే సినీ నటి చార్మి డ్రగ్ కేసులో విచారణకు వచ్చిన సందర్భంలో ఒక ఎక్సైజ్ పోలీసు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిండు. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఆ పోలీసుపై ఫిర్యాదు చేసింది. తక్షణమే ఆ పోలీసును ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిర్రు.
మరి ఈ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కరీంనగర్ పోలీసుపై ఎలాంటి చర్యలుంటాయో చూడాలి.