
తెలంగాణ సిఎం కేసిఆర్ ఆయన తనయుడు కేటిఆర్ ఇద్దరి పనితీరును గమనిస్తే మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. వారిద్దరూ రాష్ట్ర అభివృద్ధి కోసం విశ్రమించకుండా పనిచేస్తున్నారు. పాలనలో తమ మార్కు ఉండేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అన్నీ తామై పరిపాలనా రథాన్ని ముందుకు లాగుతున్నారు. అయితే ఆ విషయంలో మాత్రం వారిద్దరూ చెరొకటి పంచుకున్నారు. మరి వారు పంచుకున్నదేంటబ్బా అని మీకు అనుమానంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వార్త చదివేయండి.
తెలంగాణ సిఎం ఏడాది కాలంగా తెలంగాణ సచివాలయం వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. భయంకరమైన వాస్తుదోషం ఉందని చెప్పిన ఆయన అందుకే సచివాలయం వైపు రావడంలేదని ఉద్యోగులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన పాలన అంతా ప్రగతిభవన్ నుంచే నడిపిస్తున్నారు కేసిఆర్. తుదకు తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా ప్రగతిభవన్ నుంచే జరిపించేస్తున్నారు. ఇప్పుడున్న సచివాలయంతో పనే లేదన్న ఉద్దేశంతోనే ప్రగతి భవన్ నుంచే కథ నడిపిస్తున్నారు. అందుకే సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది కట్టాలన్న ప్లాన్ లో ఉన్నారు కేసిఆర్. దానికోసం తీవ్రమైన కసరత్తు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు అధికారగణం ప్రగతిభవన్ కు వెళ్లి సిఎం ఆదేశాలను మోసుకొచ్చి సచివాలయం నుంచి జిఓల రూపంలో విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. విజిటర్స్ కూడా ప్రగతిభవన్ కే వెళ్లి సిఎంను కలుసుకుంటున్నారు. సచివాలయానికి సిఎం రాకపోవడంతో పూర్తిగా హడావిడి తగ్గింది.
ఇక మంత్రి కేటిఆర్ సైతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఆయన అప్పుడప్పుడు మాత్రమే సచివాలయం వస్తున్నారు. అడపాదడపా సచివాలయంలోని డి బ్లాక్ లో తన సమీక్ష సమావేశాలు, ఇతర సమావేశాలు జరుపుకుంటున్నారు. గత కొంతకాలంగా కేటిఆర్ సమావేశాలైనా, సమీక్షలైనా బేగంపేట క్యాంపు ఆఫీసును వాడుకుంటున్నారు. విచిత్రమేమంటే ప్రగతిభవన్ నిర్మాణం పూర్తి కాకముందు సిఎం కేసిఆర్ బేగంపేట క్యాంపు ఆఫీసు (ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో నిర్మించిన భవనం) నుంచి పాలన నడిపారు. ఆ సమయంలో కేటిఆర్ తన అధికారిక కార్యకలాపాలన్నీ బంజారాహిల్స్ లో ఉన్న తమ సొంత ఇంటి నుంచి నడిపేవారు. కేటిఆర్ మంత్రి అయినా మినిస్టర్స్ క్వార్టర్స్ లో నివాసం ఉండడంలేదు కాబట్టి తనకోసం వచ్చిపోయే విజిటర్స్ ను అ రోజుల్లో బంజారాహిల్స్ లో ఉన్న సొంత ఇంటిలో కలుసుకునేవారు.
తాజాగా ప్రగతిభవన్ పూర్తయి వినియోగంలోకి వచ్చిన తర్వాత సిఎం ప్రగతిభనవ్ నుంచి పాలనా వ్యవహారాలు నడిపిస్తుండగా పాత క్యాంపు ఆఫీసును కేటిఆర్ వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో కేటిఆర్ తరచుగా బేగంపేట క్యాంపు ఆఫీసు నుంచే పాలనా వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. సంబంధిత శాఖల అధికారులంతా అక్కడికి వెళ్లి సమీక్షల్లో పాలుపంచుకుంటున్న పరిస్థితి ఉంది.
సో... మొత్తానికి సచివాలయంలో కొందరు ఉద్యోగులు సరదాగా చర్చించుకుంటున్న మాటేంటంటే... సిఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్... ఇద్దరూ చెరొకటి పంచుకున్నారు... అని.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి