
తెలంగాణ ఐటి శాఖ మంత్రి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంచనల ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు ఎవరికో వ్యతిరేకంగా కాదు. సొంత పార్టీ నేతలకు షాక్ కలిగే నిర్ణయం, ఆదేశాలు కావడం గమనార్హం. ఇంతకూ కేటిఆర్ తీసుకున్న ఆ షాకింగ్ డిసిషన్ ఏంటనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవండి.
రేపు వరంగల్ పట్టణంలో మంత్రి కేటిఆర్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్ స్థానిక టిఆర్ఎస్ నాయకులంతా పోటీ పడి నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గతంలో హైదరాబాద్ నగరంలో ఒక్క ఫ్లెక్సీ కూడా కనిపించొద్దని కేటిఆర్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గతంలో హైదరాబాద్ లో మున్సిపల్ మంత్రిగా మీరిచ్చిన ఆదేశాలు వరంగల్ నగరంలో అమలవుతాయా లేదా అని ఒక సామాన్యుడు ట్విట్టర్ లో కేటిఆర్ ను ప్రశ్నించారు. ఆ ట్విట్ కు స్పందించిన కేటిఆర్ తక్షణమే వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నీ తొలగించాలని నగర పాలక కమిషనర్ ను ఆదేశించారు. అంతేకాకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి ఫెనాల్టీ విధించాలని ట్విట్టర్ లోనే ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటిఆర్.
దీంతో ఒక సామాన్యుడు లేవనెత్తిన అంశానికి కేటిఆర్ ఎంతగా స్పందించారో చూశారా అని కొందరు పార్టీ నేతలు ప్రశంసిస్తున్నారు. అయితే కేటిఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగానే ఫ్లెక్సీలు వద్దని ఆదేశాలిచ్చి ఉంటే మాకు ఈ కష్టం వచ్చేది కాదు, ఫైన్లు కట్టాల్సిన పనిలేదు కదా అని వరంగల్ కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు మరి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి