
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లీగల్ నోటీసు పంపించారు. ఈ నోటీసులో, బండి సంజయ్ వాస్తవాధారంలేని ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అసత్యాలు మాట్లాడారని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై ఆరోపణలు చేశారన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం తగదని, ప్రజాస్వామ్యంలో ఇది చెడు పద్ధతికి ఉదాహరణ అని నోటీసులో స్పష్టం చేశారు.
తనపై చేసిన ఆరోపణలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అబద్ధ ప్రచారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. తప్పుడు సమాచారం ప్రజల్లో వ్యాప్తి చెందకుండా చూసే బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే విస్తృత చర్చకు దారి తీసింది. ఈ కేసులో పలువురు మాజీ పోలీసు అధికారులు అరెస్టు కావడంతో, రాజకీయ వర్గాల్లో పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ లీగల్ నోటీసు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేటీఆర్ నోటీసు పంపిన తర్వాత, ఈ అంశం న్యాయపరంగా ఏ దశకు చేరుకుంటుందో ఆసక్తిగా మారింది. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.