
Chamakura Malla Reddy: మేడ్చల్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ( Malla reddy) పరిచయం అవసరం లేని పేరు. ఆయన రాజకీయాల్లో చాలా చురుకగా పాల్గొంటారు. ఆయన ఏ విషయం చెప్పాలనుకున్నా.. ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా చెప్పేస్తారు. ఏదైనా సరే నిజాన్ని కుండబద్దలు కొట్టి చెప్పేస్తారు. అలాగే.. ఆయన ఏం మాట్లాడిన సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది.
తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాలకు దూరమవుతున్నారని, రిటైర్‌మెంట్ తీసుకోవడానికి సిద్ధమని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలేమిటో క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి ఏమి అనుకుంటున్నారంటే?
మేడ్చల్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రాజకీయాల నుంచి దూరం అవుతున్నారనే ప్రచారాలపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎప్పుడూ అనలేదని అన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాననీ చెప్పలేదనీ, దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు పెడతానని ప్రకటించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని, ఎప్పుడూ తెలుగుదేశం లేదా బీజేపీ పార్టీలో చేరడం లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు.
ఆదివారం జవహర్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మల్లారెడ్డి (Mallareddy)మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంలో ఓ రిపోర్టర్ నిన్న మల్లారెడ్డి వ్యాఖ్యలపై ప్రశ్నిస్తూ.. రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారా? మీరు కూడా వారసత్వాన్ని కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మల్లారెడ్డి స్పందిస్తూ.. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ప్రసక్తే లేదని, నిన్న తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. మన దేశంలో రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదని తెలిపారు.
ఓ జర్నలిస్ట్ మిత్రుడు అడిగిన ప్రశ్నకు తాను సమాధానంగా తాను దేశమంతా విద్యా సంస్థలను ఓపెన్ చేస్తానని చెప్పాను. కానీ, రాజకీయాలను వదిలేస్తా అని అనలేదు. బీజేపీలోకి తెలుగు దేశంలోకి నేను వెళ్ళడం లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతాను అని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఇంకా తాను మూడు సంవత్సరాలు పదవి ఉంటాననీ, తనకు 73 సంవత్సరాలు ఉన్నాయని చెప్పినట్లు గుర్తు చేశారు. అలాగే జపాన్ దేశంలో రిటైర్మెంట్ లేదని, అలాగే తనకు కూడా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ లేదని తాను రాజకీయాల నుంచి తప్పుకొనని మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి స్పష్టం చేశారు.