వీటన్నింటికీ శంకుస్థాపన చేయడానికి వచ్చారనుకున్నానే .. అమిత్ షా తెలంగాణ పర్యటనపై కేటీఆర్ సెటైర్లు

Siva Kodati |  
Published : Apr 23, 2023, 08:15 PM ISTUpdated : Apr 23, 2023, 09:59 PM IST
వీటన్నింటికీ శంకుస్థాపన చేయడానికి వచ్చారనుకున్నానే .. అమిత్ షా తెలంగాణ పర్యటనపై కేటీఆర్ సెటైర్లు

సారాంశం

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను తెలంగాణను మించి ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి ప్రశ్నించారు . 

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించారు. తఐటీఐఆర్ హైదరాబాద్, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్‌కు జాతీయ హోదా, హైదరాబాద్ మెట్రో రెండో దశ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ, ఐఐటీ , నవోదయ, మెడికల్ నర్సింగ్ కాలేజీలకు శంకుస్థాపనకు వస్తున్నారని అనుకున్నానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అమిత్ షా వీటి కోసం రాలేదంటూ లాఫింగ్ ఏమోజీ పెట్టారు కేటీఆర్. బీజేపీ పాలిత రాష్ట్రాలను తెలంగాణను మించి ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి ప్రశ్నించారు . 

మోడీని ప్రధాని పీఠం ఎక్కిస్తే దేశాన్ని బలి పీఠం ఎక్కించినట్లేనని కేటీఆర్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాదు.. అంధకారంలోకేనంటూ ఆయన జోస్యం చెప్పారు. 2024లో వైఫల్యాలపై మోడీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ స్టీరింగే అదానీ చేతికి చిక్కిందని.. కార్పోరేట్ కబంద హస్తాల్లో కమలం విలవిలలాడుతోందని ఆయన ఆరోపించారు. త్వరలో తెలంగాణలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చి కూడా ఖాళీ అవుతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు నడవవన్నారు. హిండెన్‌బర్గ్ రిపోర్టుతో బీజేపీ ఫుల్ పిక్చర్‌ను దేశప్రజలు 70 ఎంఎంలో చూశారని కేటీఆర్ చురకలంటించారు. అదానీపై జేపీసీ వేయని బీజీపీకి సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కుందా అని మంత్రి ప్రశ్నించారు. బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం మన్నించదని, ముక్కు నేలకు రాసినా.. మోకాళ్ల యాత్ర చేసినా మోసాల మోడీని తెలంగాణ సమాజం నమ్మదన్నారు కేటీఆర్.  

అంతకుముందు చేవేళ్లలో జరిగిన బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామన్నారు. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో వుందని ఆరోపించారు. ఒవైసీ అజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారని.. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని అమిత్ తెలిపారు. 

Also Read: మజ్లిస్‌కు భయపడేది లేదు.. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం : అమిత్ షా సంచలన ప్రకటన

తెలంగాణలో హైవేల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని.. కేంద్ర పథకాలను రాష్ట్రం సరిగా అమలు చేయడం లేదన్నారు. కేంద్రం అందించే వేల కోట్లు ప్రజలకు అందుతున్నాయా అని అమిత్ షా ప్రశ్నించారు. మూడేళ్లలో నాబార్దు ద్వారా రూ.60 కోట్లు అందించామని.. రామగుండం విద్యుత్ కేంద్రం కోసం నిధులు ఇచ్చామని ఆయన తెలిపారు. అలాగే సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణకు , ఎంఎంటీఎస్ విస్తరణకు నిధులిచ్చామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని అమిత్ షా కోరారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే