
KTR Reacts on Kavitha Suspension: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తొలిసారి కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ అంశంపై స్పందించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, పార్టీ అంతర్గత చర్చల తర్వాతే అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. ‘‘ఇక ఆ అంశంపై మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని ఆయన తేల్చిచెప్పారు.
కవిత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీని బతికించుకోవాలంటే వారిని పక్కన పెట్టాలని ఆమె సూచించారు. అయితే కేటీఆర్ మాత్రం ఈ ఆరోపణలపై ఎలాంటి మరిన్ని వ్యాఖ్యలు చేయకుండా, పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానన్న సంకేతాలు ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం దుష్ప్రచారమేనని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీబీఐకి కేసు అప్పగించడం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని అన్నారు. ‘‘మల్లన్నసాగర్ నుంచి తీసుకొస్తున్న నీటినే మూసీ పునరుజ్జీవనానికి వాడుతున్నారు. గండిపేటలో శంకుస్థాపన చేసి కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది’’ అని విమర్శించారు. ‘‘ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
‘‘94 వేల కోట్ల ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని చెప్పడం తప్పుదారి పట్టించడం కాదా’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు ఎందుకు చేయలేదని అడిగిన అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.
‘‘ఒక్క పిల్లర్‌కి రూ.250 కోట్లు ఖర్చవుతుందని ఎజెన్సీలు చెప్పినా పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు మాత్రం కొత్త పనులకు రూ.1700 కోట్లు పెంచారు. మూసీ పేరుతో డబ్బులు దండుకోవడమే జరుగుతోంది’’ అని కేటీఆర్ ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ‘‘సిగ్గుమాలిన ప్రభుత్వం’’ అని అభివర్ణించిన కేటీఆర్, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఉచిత తాగునీటి పథకాన్ని రద్దు చేస్తారనే అనుమానాలు వ్యక్తం చేశారు.
కవితపై పార్టీ తీసుకున్న నిర్ణయం పూర్తయ్యిందని, ఇక మళ్లీ ప్రస్తావన అవసరం లేదని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ‘‘ఒక్కసారి తీసుకున్న నిర్ణయం తిరగరాయాల్సిన అవసరం లేదు’’ అని ఆయన తేల్చిచెప్పారు.
ఇక ఉప రాష్ట్రపతి ఎన్నికలపై మాట్లాడుతూ కేటీఆర్, ‘‘నోటా ఉంటే దానికి వేసేవాళ్లం. కానీ లేనందున తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని చెప్పారు. అలాగే, యూరియా సమస్యపై ఎన్డీయే, ఇండియా కూటములు స్పందించకపోవడంతో ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.