
Telangana CM Revanth Reddy: పూణే సదరన్ కమాండ్ కు చెందిన కమాండింగ్-ఇన్-చీఫ్, జనరల్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశం సైన్యం, పౌర పరిపాలన మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసే దిశగా ముఖ్యమైన అడుగుగా నిలిచింది.
ఈ భేటీలో మిలిటరీ-సివిల్ ఫ్యూషన్, అంతర్గత భద్రత, వెటరన్ వేల్ఫేర్, విపత్తు నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలపై లోతైన చర్చలు జరిగాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు సమర్థవంతమైన మెకానిజం అవసరమనీ, ఇంటెలిజెన్స్ షేరింగ్ బలోపేతం కావాలని సమావేశంలో ప్రాధాన్యతనిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రకృతి విపత్తుల సమయంలో ఆర్మీ, పౌర వనరుల సమన్వయం ద్వారా వేగవంతమైన సహాయక చర్యలు తీసుకోవడం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (HADR) లో ఆర్మీ చేసే కృషిని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.
విరమణ పొందిన సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం ప్రభుత్వ, సైన్యం ఉమ్మడి ప్రాధాన్యతగా కొనసాగాలని నిర్ణయించారు. వారి గౌరవం, జీవన ప్రమాణాలను కాపాడేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అవసరమని ఇరువురు అంగీకరించారు.
లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ మాట్లాడుతూ.. “దక్షిణ కమాండ్ ఎల్లప్పుడూ దేశ రక్షణతో పాటు రాష్ట్ర పురోగతి, శ్రేయస్సులోనూ అర్థవంతమైన పాత్ర పోషించడానికి కట్టుబడి ఉంది” అని అన్నారు. ఈ భేటీ ద్వారా తెలంగాణలో మిలిటరీ-సివిల్ సమన్వయం మరింత బలోపేతం కానుందని స్పష్టం చేశారు.