మోడీకి, ఈడీకి భయపడేది లేదు, ప్రజలే తేలుస్తారు: కేటీఆర్

Published : Mar 15, 2023, 05:58 PM ISTUpdated : Mar 15, 2023, 05:59 PM IST
మోడీకి, ఈడీకి భయపడేది లేదు, ప్రజలే తేలుస్తారు: కేటీఆర్

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప నటుడని, ఆస్కార్ కు ప్రతిపాదనలు పంపితే ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దేశ సంపదను మోడీ ఆదానీకి దోచిపెడుతున్నారని విమర్శించారు.

కామారెడ్డి: ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ధ్వజమెత్తారు. దేశ సంపదను నరేంద్ర మోడీ ఆదానీకి దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రశ్నించినవారి మీద కేసులు పెట్టి వారిని వేధిస్తున్నారని ఆయన అన్నారు. బిజెపిని తెలంగాణకు పట్టిన దరిద్రంగా ఆయన అభివర్ణించారు.

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకానికి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. మంజీరా నదిపై నిర్మించిన వంతెనను కేటిఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత పిట్లంలో ఏర్పాటైన సభలో మాట్లాడారు. బిజెపిపైనే కాకుండా కాంగ్రెస్ మీద ఆయన సభలో విమర్శల వర్షం కురిపించారు. 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు చేసిందేమిటని ఆయన అడిగారు. ఇన్నేళ్లలో ఏమీ చేయని నాయకులకు మళ్లీ ఎందుకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. 

మోడీపై కేటిఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ మన దేశంలో అద్భుతమైన నటుడు అని, ఆస్కార్ కు ప్రతిపాదనలు పంపితే మోడీకి ఉత్తమ నటుడి అవార్డు వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు. దేశ సంపదనంతా దోచిపెట్టి ఆదానీ నుంచి పార్టీకి చందాలు తీసుకుంటున్నారని ఆయన మోడీని విమర్శించారు. 

రాష్ట్ర విభజన జరిగినప్పుడు పలు హామీలు ఇచ్చారని అంటూ కేటిఆర్ కాజీపే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారాలను ప్రస్తావించారు. వాటికి హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ఆయన అన్నారు. అయినా తెలంగాణకు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం రూ.70 ఉన్న పెట్రోల్ నుంచి రూ.115కి పెంచిందని, గ్యాస్ సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1200కు పెంచిందని గుర్తు చేశారు.

దేశానికి ఎంతో అన్యాయం చేసిన మోడీ దేవుడా అని ఆయన ప్రశ్నిస్తూ ఆదానీకి దేవుడైతే కావచ్చుగానీ మనకు కాదని ఆయన అన్నారు.మోడీకి, ఈడీకి భయపడేది లేదని చెప్పారు. ఎవరు నీతిపరులో, ఎవరు అవినీతిపరులో 2023 ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెబుతారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించి మూడోసారి కేసిఆర్ ను సిఎం చేయాలని ఆయన ప్రజలను కోరారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?