ఓటుకు నోటు.. సీటుకు రేటు చేసేటోడు రేవంత్ రెడ్డి అని.. ఆయనకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని కోఠిలో అమ్మేస్తాడంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ విరుచుకు పడ్డారు. రేవంత్ రెడ్డికి అధికారం ఇస్తే కోఠిలో అమ్మేస్తాడంటూ… ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఓటుకు నోటు కేసులో చిక్కిన దొంగ. నోట్ల కట్టలతో పచ్చిగా దొంగ దొరికిపోయాడు. ఇప్పుడేమో దొంగ నీతులు చెబుతున్నాడు. అమరుల స్తూపం వద్దకు వచ్చి మద్యం పంచకుండా గెలుద్దాం.. ప్రమాణాలు చేద్దాం రా.. అంటూ సవాలు విసిరుతున్నాడు. రేవంత్ రెడ్డిని రేటెంత రెడ్డి అంటూ కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. ఆయన చేతికి గనక అధికారం అప్పచెపితే రాష్ట్రాన్ని కోఠిలో చారాణాకు అమ్మేస్తాడు. కాంగ్రెస్ పార్టీని అసలు నమ్మొద్దు’’ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఆదివారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బీఆర్ఎస్వీ విస్తృత సాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ బతిమాలుకుంటున్నారని ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డబ్బు సంచులు తీసుకొచ్చిన ఇక్కడ చేసేదేం లేదని వ్యాఖ్యానించారు.
undefined
కాంగ్రెస్ వైఫల్యాలను చూడడానికి కర్నాటక వెళ్లాల్సిన అవసరం లేదు: కేటీఆర్
కర్ణాటక నుంచి వచ్చిన డీకే శివకుమార్ అక్కడ రైతులకు ఐదు గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. తెలంగాణలో ఇప్పటికే వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నామని.. ఇది తెలియకుండా ఆయన మాట్లాడడం చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదంటూ చెప్పుకొచ్చారు. ఉద్యమ సమయంలో యువత విద్యార్థులకు చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ రాజకీయ యుద్ధంలో తమతో పోటీ పడుతుందని అన్నారు. ఇప్పుడేమో ఓట్లు అడగడానికి వస్తుందంటూ చెప్పారు.
ఇక బండి సంజయ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లపై కూడా కేటీఆర్ విరుచుకుపడ్డారు. గతంలో ప్రశ్న పత్రాలను లీక్ చేసింది.. బిజెపి ఎంపీ బండి సంజయ్ చెంచా గాడు కాదా? అంటూ ప్రశ్నించారు. గ్రూప్-2 పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేసిందే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బండి సంజయ్ లు. ఆ తర్వాత దాన్ని రద్దు చేస్తే గొడవ చేసింది కూడా వీరిద్దరే. గ్రూప్ 2 పరీక్ష రద్దు కోసం కోర్టులో కేసు కూడా వేశారు. రద్దు చేయించారు. కడుపులో గుద్ది నోట్లో పిప్పరమెంటులు పెడుతున్నారు వీళ్ళు.
టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణలో కొన్ని తప్పులు జరిగాయి ఒప్పుకుంటున్నాం.. డిసెంబర్ 3 తర్వాత టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకుంటా అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.