టీఎస్పీఎస్సీని పునరుద్ధరిస్తాం.. ప్రతియేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం: మంత్రి కేటీఆర్

By Mahesh Rajamoni  |  First Published Oct 30, 2023, 5:42 AM IST

Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ)ని పూర్తిగా పునరుద్ధరిస్తామ‌నీ, ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామ‌ని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. ప్ర‌తి ఏటా భర్తీ చేయాల్సిన రిటైర్మెంట్లు, ఖాళీల వివరాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.
 


Telangana Assembly Elections 2023: గత తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏటా 13 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టిందనీ, డిసెంబర్ 3 తర్వాత టీఎస్ పీఎస్సీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ టీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం సమావేశంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడారు. టీఎస్ పీఎస్సీని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందనీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కచ్చితంగా పునరుద్ధరిస్తుందని చెప్పారు. ప్రతి ఏటా భర్తీ చేయాల్సిన రిటైర్మెంట్లు, ఖాళీల వివరాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. 

"మనమందరం మనుషులమేనని, తప్పులు తప్పవని, తప్పును అంగీకరించాలని" కేటీఆర్  అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందనీ, 90 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తోందన్నారు. ఏటా 22 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరొకటి లేదన్నారు. అలాగే, సోషల్ మీడియాలో బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని విద్యార్థులను కోరారు. బీఆర్ఎస్ పై ఫేక్ న్యూస్ పై పోరాటం చేయ‌డానికి బీఆర్ఎస్వీ సిద్ధంగా ఉండాల‌ని అన్నారు. తమ గ్రామం, పట్టణ ప్రగతిలో సెల్ఫీలు తీసుకుని గ్రూపుల్లో పంపాలని కోరారు. జిల్లాకు మెడికల్ కాలేజీలు, రాష్ట్రంలోని పట్టణాలు ఎలా అభివృద్ధి చెందాయో చూపించండ‌ని కోరారు.

Latest Videos

ప్రతి గ్రామం, పట్టణంలో చర్చ చేపట్టాలనీ, ఇంత‌కుముందు, ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉండేదో పోల్చాలని బీఆర్ఎస్ నేత విద్యార్థులను కోరారు. విద్యార్థులను చంపిన వారు నివాళులు అర్పించేందుకు వస్తున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని చూస్తున్నారనీ, ప్రశ్నాపత్రం ఎవరు లీక్ చేశారో అందరికీ తెలుసన్నారు. కాగా, అంతకుముందు తమ రాష్ట్రంలో ఎన్నికల వాగ్దానాల అమలును సాక్షిగా చూడాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఆహ్వానించ‌డంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందిస్తూ.. తమ వైఫల్యాలను చూసేందుకు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘మీ వైఫల్యాలను చూసేందుకు కర్నాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ వల్ల (కర్నాటక ప్రభుత్వం) మోసపోయిన రైతులు ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. కాంగ్రెస్‌ వల్ల పొంచి ఉన్న ప్రమాదం గురించి రైతులు తెలంగాణ ప్రజలను ముందుగానే హెచ్చరిస్తున్నారు' అని ఆయన సందేశంలో పేర్కొన్నారు. 

click me!