
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు వరద సాయం ఇంకా ఇవ్వలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రులు వచ్చి ఫొటోలు దిగిపోయారని అన్నారు. గుజరాత్‌లో వరదలు వస్తే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెళ్లి రూ. 1,000 కోట్లు ఇచ్చారని అన్నారు. హైదరాబాద్ అభివృద్దిలో కేంద్రం వాటా శూన్యం అని చెప్పారు. తెలంగాణ వేరే దేశమైనట్టుగా వ్యవహరిస్తున్నారని కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో శనివారం ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎస్ఎన్‌డీపీ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ఏరియాల్లో ఇష్టమొచ్చినట్టుగా రోడ్లు మూసివేస్తే ఊరుకోమని చెప్పారు. ఇలాగే అడ్డంకులు కల్పించుకుంటూ వెళ్తే తాము కూడా వారికి నీళ్లు బంద్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగితే చూస్తూ ఊరుకోమని తెలిపారు. ప్రజల కోసం ఎంత దూరమైన పోతామని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో వరద నీరు, మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల కోసం ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఎస్ఎన్‌డీపీ కింద రూ. 985 కోట్ల 45 లక్షల వ్యయంతో మొత్తం 60 పనులు చేపట్టామని చెప్పారు. ఈ పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు హైదరాబాద్‌లో మూడు దశల్లో పనులు చేపట్టాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. ఎంసీహెచ్‌లో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలు లేవని తెలిపారు. శివారు ప్రాంతాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయాలని నిర్ణయించామన్నారు. రూ. 11 వేల కోట్లతో హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు చెప్పారు.
జీహెచ్ఎంసీ ఏరియాలో రూ. 735 కోట్లతో, జీహెచ్ఎంసీ వెలుపల రూ. 250 కోట్లతో 60 పనులను చేపట్టామని కేటీఆర్ చెప్పారు. ఈ పనులపై ప్రతి వారం తానే సమీక్షిస్తున్నానని తెలిపారు. ఎస్ఎన్‌డీపీ పనుల్లో కేంద్ర ప్రభుత్వ వాటా లేదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కలుషిత నీటిని తాగి ముషీరాబాద్ భోలక్‌పూర్‌లో 11 మంది మృతి చెందారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం మురికి నీరు, మంచి నీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.