వెంకయ్య, కెటిఆర్ పై మరకలు

First Published Jul 25, 2017, 8:02 PM IST
Highlights
  • వెంకయ్య, కెటిఆర్ పై ఆరోపణలు గుప్పించిన జైరాం రమేష్
  • తిట్లదండకం అందుకున్న కెటిఆర్, వెంకయ్య
  • కెటిఆర్ మరో వీరప్పన్ అంటూ విరుచుకుపడ్డ నారాయణ
  • నారాయణకు వయసు పెరిగి మతి భ్రమించిందన్న కెటిఆర్

ఉపరాష్ట్రపతి పదవికి రేసులో ఉన్న వెంకయ్య నాయుడు, తెలంగాణ సిఎం తనయుడు, తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ పై మరకలు పడ్డాయి. వారిద్దరూ అక్రమాలకు పాల్పడ్డారని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అటు బిజెపి, ఇటు టిఆర్ఎస్ లో కల్లోలం మొదలైంది. రెండు పార్టీలు ధీటుగా ఎదురు దాడికి దిగాయి. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు ఆ పార్టీల నేతలు. ఇటు కెటిఆర్ అటు వెంకయ్య నాయుడు ఇద్దరూ కూడా తమపై వచ్చిన ఆరోపణలకు ప్రతి విమర్శలు, తిట్లపురాణం, బూతు పురాణం ఎత్తుకున్నారు తప్ప ఆరోపణలపై సమాధానం చెప్పలేదు.

మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఢిల్లీ వేదికగా వెంకయ్య నాయుడు, కెటిఆర్ మీద సూటి ప్రశ్నలు సంధించారు. వెంకయ్యకు నాలుగు ప్రశ్నలు వేయగా అందులో రెండు ప్రశ్నలు కెటిఆర్ కు లింక్ అయి ఉన్నాయి. జైరాం రమేష్ ప్రశ్నలు ఇవీ.

వెంకయ్య నాయుడు కుమార్తె నేతృత్వంలోని స్వర్ణభారతి ట్రస్టు హెచ్ఎండిఎ కి వివిధ ఛార్జీల కింద బాకీ ఉన్న 2 కోట్ల రూపాయలను తెలంగాణ సర్కారు జూన్ 20వ తేదీన రహస్య ఉత్తర్వుల ద్వారా మినహాయింపు ఇచ్చిన మాట వాస్తవమేనా? కాదా ? అని ప్రశ్నించారు.

వెంకయ్యనాయుడు కుమారుడికి చెందిన హర్ష టయోటా, కెటిఆర్ కుమారుడి పేరుతో ఉన్న హిమాన్షు మోటార్స్ నుంచి పోలీసుల కోసం 271 కోట్ల రూపాయల విలువైన వాహనాల కొనుగోలు నిమిత్తం 2014 జులైలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి టెండర్లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు.

దీనికి వెంకయ్య నాయుడు కూడా స్పందించారు. కానీ నేరుగా స్పందించకుండా గతంలో చేశారు కదా? ఆ సంస్థలతో తనకు సంబంధం లేదంటూ దాటవేత ధోరణిలో సమాధానమిచ్చారు. వెంకయ్య సమాధానాలు కూడా చూద్దాం.

ఇలాంటి మినహాయింపులివ్వడం అదే మొదలుకాదు, ఆఖరు కాదు. దానిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే వివరణ ఇచ్చింది. లాభాపేక్షలేకుండా పనిచేసే సంస్థలకు ఇలాంటి మినహాయింపులివ్వకుండా ప్రభుత్వాన్ని నిలువరించే చట్టమేమీ లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కాబట్టి తన కూతురు సంస్థకు 2కోట్ల పన్నుల మినహాయింపు తప్పేం కాదు కదా? అన్నారు వెంకయ్య.

రెండో ప్రశ్నలకు... నా పిల్లలు చేసే వ్యాపారాలకు ఎప్పటినుంచో నేను దూరంగా ఉంటున్నాను. హర్ష టయోటా ఒక డీలర్‌గా నేరుగా ఎప్పుడూ ప్రభుత్వంతో వ్యవహారాలు నడపలేదు. మాతృ సంస్థ... అంటే టయోటా... రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం వాహనాలు సరఫరా చేయడానికి సుముఖత వ్యక్తంచేసింది. చెల్లింపులు ఆ సంస్థకే నేరుగా చేశారు. అని చెప్పుకొచ్చారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా, టెండర్లు లేకుండా ఉత్తర్వులు ఇచ్చారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.

 

ఇక ఈ రెండు అంశాలపై తెలంగాణ మంత్రి కెటిఆర్ ఇవాళ స్పందించారు. కానీ ఆయన ఈ రెండు అంశాలు తప్ప మిగతా అన్ని అంశాలపై మాట్లాడారు. జైరాం రమేష్ ను ఉతికి ఆరేశారు. సిగ్గు, శరం ఉందా అని నిలదీశారు. తనకు క్షమాపణ చెప్పాలన్నారు. తనకు కంపెనీ ఉన్నట్లు రుజువు చేస్తే జైరాం రమేష్ కే రాసిస్తానన్నారు.

మరోవైపు సిపిఐ నేత నారాయణ నిన్న సిరిసిల్లలో కెటిఆర్ ను వీరప్పన్ తో పోల్చారు. దానికి కెటిఆర్ మరింత ఘాటుగా స్పందించారు. నారాయణకు వయసు పెరిగిన కొద్దీ మతి భ్రమించిందంటూ ఆయనకు కూడా సిగ్గు, శరం లేవంటూ దూషణలకు దిగారు కెటిఆర్.

మొత్తానికి ఉప రాష్ట్రపతి పదవిలోకి వెళ్లనున్న వెంకయ్య నాయుడు, తెలంగాణలో సిఎం తర్వాత సిఎం లాంటి వ్యక్తి కెటిఆర్ పై మరకలు రావడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది.

click me!