‘సగం చంపాను.. క్షుద్రపూజ చేసి శవాన్ని బతికిస్తా..’ జగిత్యాలలో కలకలం, దంపతుల అరెస్ట్.. (వీడియో)

By AN Telugu  |  First Published Aug 14, 2021, 7:36 AM IST

క్షుద్ర పూజలు  చేస్తే చనిపోయిన వ్యక్తి  బతుకుతాడని, ఇందుకు పోలీసులు అడ్డుకోవడం తగదని ఆగ్రహిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం చర్చనీయాంశమైంది.


ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతుంటే... మరోవైపు మూఢనమ్మకాలు ప్రజలని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. చనిపోయిన వ్యక్తిని తిరిగి బతికిస్తామంటూ దంపతులు ముందుకు... రావడం మృతుని కుటుంబ సభ్యులు వారి మాటలు నమ్మడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. 

"

Latest Videos

undefined

అయితే క్షుద్ర పూజలు  చేస్తే చనిపోయిన వ్యక్తి  బతుకుతాడని, ఇందుకు పోలీసులు అడ్డుకోవడం తగదని ఆగ్రహిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం చర్చనీయాంశమైంది.

పోలీసుల కథనం ప్రకారం...  జగిత్యాల జిల్లా కేంద్రంలో లోని తారకరామానగర్ కు చెందిన ఒర్సు రమేష్, అనిత భార్య భర్తలు. కూలిపని చేసుకుంటూ బతుకుతున్నారు. 15 రోజుల క్రితం వారు తమ ఇంటి సమీపంలోని కొమ్మరాజు పుల్లేశ్, సుభద్ర దంపతులతో గొడవ పడ్డారు. అంతు చూస్తానంటూ ఆ సమయంలో పుల్లేశ్.. రమేష్ ను బెదిరించారు. 

కొద్దిరోజుల తర్వాత రమేశ్‌ ఇంట్లో దుర్గమ్మ పండగ చేసుకున్నారు. మరుసటి రోజు రమేష్ పిలవకుండానే పుల్లేష్ అతని ఇంటికి భోజనం కోసం వెళ్ళాడు. అప్పటికి భోజనం అయిపోగా,  కాసేపు ఆగితే వండిపెడతానని రమేష్ చెప్పాడు. అయితే పుల్లేశ్‌  ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.  ఆ తర్వాతి రోజు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.  చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

కొమ్మరాజు పుల్లేశ్,  సుభద్ర చేతబడి చేయడంతోనే రమేష్ చనిపోయాడని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆ దంపతులను చెట్టుకు కట్టేసి కొట్టారు. దెబ్బలు భరించలేక... తానే చేతబడి చేశానని... సగం చంపానని... క్షుద్ర పూజ చేసి బతికి ఇస్తాననినని రాజు చెప్పాడు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు పూజా సామాగ్రి తీసుకొచ్చారు.  పూజ చేసేందుకు  దంపతులు సిద్ధపడుతున్న నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు రాజు, సుభద్రలను అదుపులోకి తీసుకున్నారు.  

అయితే రమేశ్‌ సగం ప్రాణంతో ఉన్నాడని, అతని మృతదేహాన్ని తరలించవద్దని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి శవాన్ని తరలించి పరీక్షించారు. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు పుల్లేశ్‌... మంత్రం వేస్తే రమేష్ బతికి వస్తాడంటూ.. కుటుంబ సబ్యులు, బంధువులు కరీంనగర్–జగిత్యాల రహదారిపై ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జగిత్యాల డిఎస్పీ వెంకట రమణ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. కానీ రాత్రి 7 గంటల వరకు కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయలేదు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

click me!