
కాంగ్రెస్ లాంటి ప్రజాస్వామ్యం గల పార్టీ బహుశా ప్రపంచంలోనే ఎక్కడా ఉండదేమో... ఆ పార్టీ కి అసలు ప్రతిపక్షం ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పార్టీలోని నేతలే ఒకరికి మరొకరు ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటారు.
ఇన్నాళ్లు తెర వెనక రాజకీయాలు చేస్తూనో, మాటల దాడితోనో ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నించేవారు.ఇప్పుడు రూటు మారింది. కొత్తగా సర్వే ల పేరుతో ఈ బురద జల్లుడు కార్యక్రమం కాంగ్రెస్ లో మొదలైంది.
పాపం... కాంగ్రెస్ కు తెలంగాణ ఇచ్చినా ఆ క్రికెట్ దక్కకుండా పోయింది. అధికారుం ‘కారు’ తన్నుకపోయింది. ఈ నేపథ్యంలో కలసికట్టుగా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాల్సిన టీ పీసీసీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ అధికార పార్టీ గురించే మరిచి పోతున్నారు.
ఇటీవల టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను చేయించిన సర్వే గురించి మీడియాకు తెలిపారు. సర్వే ఎవరు చేశారు... ఎలా చేయించారు అనేది పక్కన పెడితే ఆయన సర్వేలో నకిరేకల్, భువనగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని తేలింది.
దీంతో ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ... ఉత్తమ్ సర్వే పై సీరియస్ అయిపోయారు.
గడ్డాలు, మీసాలు పెంచుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఉత్తమ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ... 2019 ఎన్నికల్లో 80 స్థానాల్లో గెలిచి సోనియా రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. తప్పుడు సర్వేలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించ వద్దని ఉత్తమ్‌కు సూచించారు.
వచ్చే ఎన్నికల వరకు సీఎల్పీగా తానే ఉంటానని ఉత్తమ్ చెప్పుకోవడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి పదవులు ఎప్పుడు ఊడిపోతాయో ఎవ్వరికీ తెలియదన్నారు.
ఇలా కాంగ్రెస్ లో సీనియర్ నేతలైన ఈ ఇద్దరు సర్వేల పేరుతో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటుంటే మిగిలిన నేతలు మాత్రం సొంత సర్వేలతో కాంగ్రెస్ కు వీళ్లు మరింత నష్టం తెస్తున్నారని వాపోతున్నారు.