సొంత ఇంటిని చక్కబెట్టుకుంటున్న కోదండరాం

First Published Sep 1, 2017, 1:00 PM IST
Highlights
  • సొంత జిల్లాపై కోదండరాం నజర్
  • ఆదిలాబాద్ లో అమరుల యాత్రకు ప్లాన్
  • తెలంగాణ సర్కారు పెద్దల్లో చర్చ

తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం సొంత ఇంటిని చక్కబెట్టుకుంటున్నారు. అంటే తన సొంత జిల్లాలో అమరుల స్పూర్తి యాత్రకు ప్లాన్ చేశారన్నమాట.  ఐదో విడత స్పూర్తి యాత్రను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చేపట్టాలని జెఎసి నిర్ణయించింది. ఈ యాత్ర ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నాలుగు రోజులపాటు సాగనుంది. మొదటి నాలుగు యాత్రలను కేసిఆర్ ఫ్యామిలీ ప్రజాప్రతినిధులుగా ఉన్నచోట జరిపిన కోదండరాం ఇప్పుడు తన సొంత జిల్లాలో యాత్ర చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

అమరుల స్పూర్తి యాత్రలో ఇప్పటి వరకు నాలుగు దశలు పూర్తి చేశారు కోదండరాం. అయితే మొదట హరీష్ రావు నియోజకవర్గంలో, తర్వాత కేటిఆర్ ఇలాకాలో ఆ తర్వాత సిఎం సొంత నియోజకవర్గంలో చేపట్టారు. ఈ మూడు దశల యాత్ర సాఫీగానే సాగింది. సర్కారు వైపు నుంచి కానీ, పోలీసు బలగాల నుంచి కానీ వ్యతిరేకత రాలేదు.

కానీ నాలుగో దశ అమరుల యాత్ర కేసిఆర్ కుమార్తె ఎంపిగా ఉన్న నిజామాబాద్ లో ప్లాన్ చేశారు. కానీ సర్కారు అడ్డుకున్నది. పోలీసు బలగాలు కోదండరాం ను కట్టడి చేశాయి. దీంతో యాత్ర నిజామాబాద్ లో అస్తవ్యస్తంగా సాగింది. రెండురోజులపాటు కోదండరాం ను అడ్డకుని అరెస్టు చేశారు. కొన్నచోట్ల టిఆర్ఎస్ కార్యకర్తలు జెఎసి నేతలతో గొడవకు దిగారు. టెంట్లు, వేదికలు కూలగొట్టారు. ఇక ఐదో దశ మరి కోదండరాం సొంత జిల్లాలో ఎలా జరుగుతుందా అన్న చర్చ రాజకీయాల్లో ఊపందుకుంది.

అయితే జెఎసి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నది. ఐదో దశ యాత్రలో తొలిరోజు బాసర, ముథోల్, భైంసా, కుంటాల, గొల్లమాడ, తిమ్మాపూర్, చించోలి (ఎం), సారంగాపూర్, చించోలి (బి) నిర్మల్ ఏరియాల్లో యాత్ర సాగుతుంది. తొలిరోజున భైంసా, నిర్మల్ పట్టణాల్లో బహిరంగ సభలకు ప్లాన్ చేశారు.

రెండోరోజైన 10వ తేదీన కుంటాల జలపాతం, నేరడిగొండ, బోధ, సానాల, బజార్ హత్నూర్, ఇచ్చోడ, బోరిగాం, గుడిహత్నూర్, ఆదిలాబాద్ లలో సాగనుంది. బోధ్, ఆదిలాబాద్ పట్టణాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు.

మూడోరోజున ఇంద్రవెళ్లి, ఉట్నూరు, జైనూర్, కెరిమెరి, వాంఖిడి, అసిఫాబాద్, కాగజ్ నగర్ లలో సాగుతుంది యాత్ర. అయితే ఈరోజున కాగజ్ నగర్ లో మాత్రమే బహిరంగసభ నిర్వహిస్తారు.

చివరిరోజున రెబ్బెన, తాండూరు, బెల్లంపల్లి, సోమగూడెం, మందమర్రి, జైపూర్, భీమారం, చెన్నూరు, ఇందారం, సిసిసి, నన్నూర్, మంచిర్యాల లో సాగనుంది. చివరిరోజున మంచిర్యాలలో బహిరంగసభతో ఐదో దశ అమరుల స్పూర్తి యాత్ర ముగియనుంది.

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

click me!