
మూడో దశ అమరుల స్పూర్తి యాత్రలో జెఎసి తీరు మారింది. గతంలో మాదిరిగా కాకుండా కేసిఆర్ వైఫల్యాలపై సూటిగా, ఘాటుగా విమర్శలు గుప్పించింది. కెసిఆర్ ఫామ్ హౌస్ టార్గెట్ గా కోదండరాం విమర్శల వర్షం కురిపించారు. ఫామ్ హౌస్ విలాసాల కేంద్రంగా మారిందంటూ కరుకు పదజాలం ఉపయోగించారు. ఫామ్ హౌస్ లో ఉంటే జనాల సమస్యలేం తెలుస్తాయని మండిప్డడారు.
తెలంగాణ రాజకీయాల్లో జెఎసి దూకుడు రోజు రోజుకూ పెంచుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత జెఎసి అవసరమే లేదని చీలికలు పేలికలు చేసే ప్రయత్నం సర్కారు వైపు నుంచి జరిగింది. ఉద్యోగ సంఘాలను బయటకు గుంజి పడేశారు. ప్రజా సంఘాలకు పొగ పెట్టారు. కానీ కోదండరాం మాత్రం జెఎసి పనిచేస్తదని, రేపు నేను లేకపోయినా జెఎసి పనిచేస్తదని స్పష్టం చేశారు.
తెలంగాణ సర్కారు వయసు పెరుగుతన్న కొద్దీ అంతే సమాంతరంగా తెలంగాణ జెఎసి ధిక్కార స్వరం పెంచుతూ పోతున్నది. తెలంగాణ వచ్చిన తొలి ఏడాదిలో అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చారు జెఎసి నేతలు. తర్వాత సర్కారుపై సుతిమెత్తని విమర్శలు చేశారు. అంశాల వారీగా ప్రశ్నించారు. ఇప్పుడు టాప్ గేర్ లో ఉంది జెఎసి తీరు. ఏకంగా నిలదీసే స్టేజీకి వచ్చేశారు.
గజ్వెల్ స్పూర్తి యాత్ర మరింత వేడి పుట్టించింది. కోదండరాం ఏకంగా ఏకంగా కెసిఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా విమర్శల వర్షం కురిపించారు. ఫామ్ హౌస్ కు కెసిఆర్ వచ్చేది కేవలం జల్సాల కోసమే అంటూ ఘాటు డోసు పెంచారు. తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ 80 ఎకరాల భూమి కొనుక్కున్నారు కానీ తెలంగాణ పేదల నుంచి 80వేల ఎకరాల భూమి గుంజుకున్నారని విమర్శించారు కోదండరాం.
ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు సర్కారు వైఫల్యాలపై సీరియస్ గా పని చేస్తున్న దాఖలాలు లేవు. దీంతో అసలైన ప్రతిపక్షం పాత్ర కోదండరాం పోశిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బాధ్యత పెరిగింది కాబట్టే విమర్శ తీవ్రత కూడా జెఎసి పెంచిందంటున్నారు. కెసిఆర్ పదే పదే పాలన గాలికొదిలేసి ఫామ్ హౌస్ లో గడపడం వల్లే జెఎసి టార్గెట్ చేసిందని నేతలు చెబుతున్నారు.
గజ్వెల్ లో అమరులయాత్ర అనూహ్యంగా విజయవంతం కావడంతో రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. ఒకవైపు జనాలు రాకుండా పోలీసులు బాగానే పనిచేసినప్పటికీ అనూహ్యమైన స్పందన వచ్చిందని జెఎసి నేతలు చెబుతున్నారు. భారీ సంఖ్యలో జనాలు కోదండరాం సభకు హాజరయ్యారు. ఇక నాలుగో విడద యాత్రపై జెఎసి నేతలు సమాయత్తమవుతున్నారు.