ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నియోజకవర్గాల పర్యటనకు వెళ్తే అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
ఖమ్మం: పాకిస్తాన్ కు వెళ్తే ఎలా పాస్ పోర్టు తీసుకోవాలో తాను నియోజకవర్గాల్లో పర్యటనకు వెళ్తే అలా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సోమవారం నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్మహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
. సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు 2019 లో టికెట్ ఇవ్వలేదన్నారు. కానీ వేరే పార్టీ నుండి వచ్చిన వ్యక్తికి ఎంపీ టికెట్ కేటాయించారని ఆయన గుర్తు చేశారు. తనకు ఇచ్చిన వాగ్ధానాన్ని పార్టీ నాయకత్వం నెరవేర్చలేదని ఆయన చెప్పారు. పోడు భూముల సమస్య విషయంలో ఇచ్చిన హామీని కూడా కేసీఆర్ అమలు చేయలేదన్నారు. పోడు భూముల విషయంలో కేసులు పెట్టినా తన అభిమానాలు ఓర్చుకున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. టీఆర్ఎస్ ఆహ్వానం మేరకు ఆ పార్టీలోకి వెళ్లినట్టుగా ఆయన చెప్పారు. టీఆర్ఎస్ లో తనతో పాటు తన వారికి పదవులు ఇప్పించుకోలేకపోయాయన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కూడా మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించినట్టుగా ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ నాయకత్వంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రంగం సిద్దం చేసుకుంటున్నారని కూడా ప్రచారం సాగుతుంది.ఈ నెల 1 వ తేదీ నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా తన అనుచరులు, అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈ సమావేశాలు నిర్వహించే సమయంలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అవుతారని కూడా ప్రచారం సాగింది.
కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం అమిత్ షాతో సమావేశం కాలేదు. ఈ ప్రచారం సాగుతున్న సమయంలోనే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తో పాటు కొందరు కాంగ్రెస్ నేతలు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం పంపారని కూడా సమాచారం. ఆత్మీయ సమ్మేళనాల్లో వ్యాఖ్యలు చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సెక్యూరిటీని తగ్గించారు. తనకు ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించినా కూడా ఇబ్బంది లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.