ఆ రెండు తెలంగాణా గ్రామాలకు విఐపి హోదా

First Published Dec 23, 2016, 7:07 AM IST
Highlights

డబుల్ బెడ్ రూం ఇళ్ల  ప్రారంభంతో విఐపి హోదా పొందిన కెసిఆర్ దత్తత  గ్రామాలు 

 ఆ రెండు గ్రామాల ప్రజల కల పండింది.

 

  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు,దత్తత తీసుకున్న  గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీలు మొదయ్యాయి.

 

దీనితో  కెసిఆర్ నియోజకవర్గం గజ్వేల్ లోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు విఐపి హోదా దక్కినట్లయింది.  ఈ రోజు ఉదయం ఈ రెండు గ్రామాలలో పండుగ వాతావరణం తొణికిస లాడింది.

 

ప్రతిష్టాత్మకమని చెప్పుకున్న  డబల్ బెడ్ రూం పథకం ఫలితాలను  హైదరాబాద్ బయట పెద్ద ఎత్తున అందుకునే అదృష్టం ఈ రెండు గ్రామాల ప్రజలకు దక్కింది. ముఖ్యమంత్రి దత్తత గ్రామాలు కావడం, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో అధికారులు ఉరుకులు పరుగులతో పనిచేశారు. మెప్పు పొందారు.

 

 ఇక్కడ ప్రభుత్వం నిర్మించిన 580 డబుల్ బెడ్రూం ఇళ్ల సామూహిక గృహప్రవేశం శుక్రవారం ఉదయం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్ రెండు గ్రామాల్లో నిర్మించిన ఇళ్లను ప్రారంభించి వేద మంత్రాల పఠనం మధ్యలబ్దిదారులకు అందించారు.

 

శుక్రవారం ఉదయం 7:53 గంటలకు సైరన్ మోగగానే ఎక్కడికక్కడ తమకు కేటాయించిన ఇంటికి గృహప్రవేశం, సత్యనారాయణస్వామి పూజలు ప్రారంభించే విధంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఒక్కో ఇంట్లో ఒక్కో బ్రహ్మణుడిచే వాస్తుపూజ,  సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. గురువారం సాయంత్రానికే వేదపండితులు అంతా మర్కూక్ లోని భవానంద ఆశ్రమానికి చేరుకున్నారు. వారంతా శుక్రవారం ఉదయం ఆరుగంటలకల్లా ప్రత్యేక వాహనాలలో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు చేరుకున్నారు.

 

ఎర్రవల్లిలో నిర్మించిన 380 డబుల్ బెడ్రూం ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాటు గృహసముదాయాల ప్రాంగణంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించి పూజలు నిర్వహించారు. గ్రామంలో తిరిగి డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. అంతకు ముందు నర్సన్నపేటలో అధ్యాధునిక సదుపాయాలతో నిర్మించిన 200 డబుల్ బెడ్రూం ఇళ్లను సీఎం ప్రారంభించారు. 

click me!