ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు: టిక్కెట్లు ఎవరికో?

By narsimha lodeFirst Published Mar 19, 2024, 6:56 AM IST
Highlights

పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.


హైదరాబాద్: పార్లమెంట్‌ ఎన్నికల్లో బరిలోకి దింపనున్న అభ్యర్థుల ఎంపికపై  భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)  అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగే అభ్యర్థులను ఆ పార్టీ ఖరారు చేసింది.  మిగిలిన ఆరు స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేయనున్నారు. లోక్ సభ ఎన్నికలకు  ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో  అభ్యర్థుల ఎంపికను త్వరితగతిన పూర్తి చేయాలని  గులాబీ బాస్  భావిస్తున్నారు.

రాష్ట్రంలోని   మెదక్, నాగర్ కర్నూల్,నల్గొండ,భువనగిరి, సికింద్రాబాద్, హైద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో  అభ్యర్థుల ఎంపికను బీఆర్ఎస్ పూర్తి చేయాల్సి ఉంది.  ఈ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపితే  గెలుపు అవకాశాలు దక్కుతాయనే విషయమై  బీఆర్ఎస్ చీఫ్  పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరిందని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా ఉన్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఈ పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైద్రాబాద్ పార్లమెంట్ స్థానాలను బీఎస్‌పీకి బీఆర్ఎస్ కేటాయించింది. అయితే పొత్తును బీఎస్‌పీ  అధినేత్రి మాయావతి వ్యతిరేకించిన నేపథ్యంలో బీఎస్‌పీకి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ నెల  18న ప్రవీణ్ కుమార్  బీఆర్ఎస్‌లో చేరారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.

మెదక్ కు ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ స్థానం నుండి  మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేరు కూడ పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో  మదన్ రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్టును పార్టీ నిరాకరించింది. మెదక్ పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దింపుతామని హామీ ఇచ్చింది. అయితే  ఈ పరిణామాల నేపథ్యంలో  మదన్ రెడ్డి కూడ  ఈ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి  తలసాని సాయికిరణ్ యాదవ్,రావుల శ్రీధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్  పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో  తలసాని సాయికిరణ్  బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యాడు.

 భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి   ఇబ్రహీంపట్టణం మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి, క్యామ మల్లేష్, జిట్టా బాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే  బూడిద బిక్షమయ్య గౌడ్ పేర్లను గులాబీ బాస్ పరిశీలిస్తున్నట్టుగా  పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.ఈ ఆరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల ఎంపిక కోసం  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

click me!