తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని ఆదివారం నాడు విస్తరించనున్నారు. మంత్రివర్గంలోకి ఆరుగురికి చోటు కల్పించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారంనాడు మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కొత్తగా తన మంత్రివర్గంలోకి ఆరుగురిని తీసుకోనున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం సీఎం కేసీఆర్ తో పాటు 12 మంది మంత్రులు ఉన్నారు. కొత్తగా మంత్రివర్గంలోకి కేటీఆర్, హరీష్ రావులకు చోటు దక్కనుంది. మహిళా కోటాల సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలకు కేబినెట్ లో చోటు దక్కనుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ నుండి సత్యవతి రాథోడ్ గతంలో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం ఆమె టీఆర్ఎస్ లో ఉన్నారు. టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో మహిళలు మంత్రులుగా లేరు. ఈ తరుణంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సత్యవతి రాథోడ్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. మరో వైపు కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడ కేసీఆర్ తన కేబినెట్ లో చోటును కల్పించే అవకాశం లేకపోలేదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో ఆమె మంత్రిగా పనిచేశారు. వైఎస్ చనిపోయిన తర్వాత కూడ రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కూడ ఆమె కొనసాగారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ కు కేబినెట్ లో చోటు దక్కనుంది. బీసీ సామాజిక వర్గం నుండి కమలాకర్ నుండి చోటు దక్కనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి పువ్వాడ అజయ్ కుమార్ కు చోటు దక్కనుంది.
గత టర్మ్ లో ఇదే సామాజిక వర్గం నుండి తుమ్మల నాగేశ్వర రావుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలు కావడంతో మంత్రివర్గంలోకి పువ్వాడ అజయ్ ను తీసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.గత ఎన్నికల్లో ఓటమి పాలైన మధుసూదనాచారి, జూపల్లి కృష్ణారావులకు కూడ కీలకమైన పదవులను కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం.
ఇక కేబినెట్ నుండి ఒకరిద్దరిని తప్పించాలని కేసీఆర్ భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఎవరిని తప్పిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటే మాత్రం మంత్రివర్గం నుండి వారిని తప్పించకపోవచ్చు. అవసరాన్ని బట్టి మాత్రమే వారిని తప్పిస్తారని పార్టీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
సంబంధిత వార్తలు
కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే
కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌కు చోటు, కారణమదేనా
సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....