అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిరుత్సాహంలో ఉన్న పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని నింపడం కోసం ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలవాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కెసిఆర్ పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ పై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. మెదక్ నుంచి ఎంపీగా పోటికి దిగిపోతున్నట్లుగా సమాచారం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఆరుస్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో ఈ పార్లమెంటు నియోజక వర్గం నుంచి కెసిఆర్ పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిరుత్సాహంలో ఉన్న పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని నింపడం కోసం ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలవాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్లుగా కాకుండా ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 పార్లమెంటు స్థానాలపై ఈ మేరకు కసరత్తు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేడర్ పై లేకుండా చూడాలని భావిస్తోంది.
పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి
దీనికోసం సిట్టింగ్ ఎంపీలలో కొంతమందికి టికెట్ నిరాకరిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, చేవెళ్ల, జహీరాబాద్ పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. అయితే ఈ సిట్టింగుల్లో కొంతమందికి టికెట్ ఈసారి దక్కకపోవచ్చు అని తెలుస్తోంది. మరి కొంతమంది స్వచ్చందంగానే పోటీ నుంచి తొలగాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరి స్థానంలో కూడా కొత్తవారికి అవకాశం ఇచ్చే దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గం బలాబలాలు, ఆర్థిక పరిపుష్టి ముఖ్యంగా చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మల్కాజిగిరి, అదిలాబాద్, నల్లగొండ బోనగిరి నియోజకవర్గాల్లో ఈ మేరకు అభ్యర్థుల కోసం వేట ప్రారంభించారు. కొంతమంది ఎంపీలు పార్టీ మారతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.