తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ లు ఇవాళ ఉదయం మాట్లాడుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో వీరిద్దరూ మాట్లాడుకున్నారు.
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైద్రాబాద్ పర్యటన సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు పలకరించుకున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు గాను రాష్ట్రపతి ముర్ము ఇవాళ హైద్రాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ , తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లు ఇవాళ హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ , సీఎం కేసీఆర్ లు పలకరించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే వరకు వేదికపై కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్ కొనసాగుతుంది.2022 జూన్ 28న తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భయాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తేనీటి విందులో తమిళిసై సౌందర రాజన్, కేసీఆర్ నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడ వారితో ఉన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తర్వాత రాజ్ భవన్ లో జరిగిన ఏ కార్యక్రమానికి కూడ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు.
2022 డిసెంబర్ 27న హైద్రాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైద్రాబాద్ కు వచ్చారు. రాష్రపతికి స్వాగతం పలికే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. గవర్నర్ తో కలిసి కేసీఆర్ రాష్ట్రపతికి ఆహ్వానం పలికారు. అదే రోజున సాయంత్రం రాజ్ భవన్ లో ఇచ్చిన విందుకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన తర్వాత కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు వెళ్లారు.
also read:హైద్రాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి: ముర్ముకు ఘనంగా స్వాగతం
గవర్నర్ తమిళిసై తీరుపై తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజ్ భవన్ , ప్రగతి భవన్ మధ్య అంతరం పెరుగుతూనే ఉంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. దీంతో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అంతరం తగ్గిందని భావించారు. కానీ ఆచరణలో అందుకు విరుద్దంగా జరిగింది. గవర్నర్ తన వద్దే బిల్లులను పెండింగ్ లో ఉంచుకోవడంపై కేసీఆర్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై గవర్నర్ తెలంగాణ సర్కార్ పై విమర్శలు చేశారు. తాజాగా ఉస్మానియా ఆసుపత్రి విషయమై గవర్నర్ కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేశారు. దీనికి మంత్రి హరీష్ రావు కౌంటరిచ్చారు. ఈ తరుణంలో రాష్ట్రపతి పర్యటన సమయంలో కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఒకరినొకరు పలకరించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.