రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారంనాడు హైద్రాబాద్ చేరుకున్నారు. ఇవాళ హైద్రాబాద్ లో జరిగే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారు.
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారంనాడు ఉదయం హైద్రాబాద్ హకీంపేట విమానాశ్రాయానికి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ సీఎం కేసీఆర్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,పలువురు మంత్రులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైద్రాబాద్ కు వచ్చారు.
ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. రాష్ట్రపతికి పలువురు మంత్రులను సీఎం కేసీఆర్ పరిచయం చేశారు. హకీంపేట విమానాశ్రయం నుండి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ముర్ము బయలుదేరి వెళ్లారు.
ఇవాళ గచ్చిబౌలిలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైద్రాబాద్ పోలీసులు ప్రకటించారు. గచ్చిబౌలి నుండి లింగంపల్లి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
also read:రాష్ట్రపతికి స్వాగతం: హకీంపేట విమానాశ్రయంలో తమిళిసై, కేసీఆర్ మాటా మంతీ
ఇవాళ్టి నుండి ఐదు రోజుల పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు 125 జయంతి ముగింపు ఉత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో జరిగే యూనివర్శీటీల స్నాతకోత్సవాల్లో పాల్గొంటారు.