లైన్ క్లియర్: కేసీఆర్ కొలువులో పద్మా దేవేందర్ రెడ్డి

By narsimha lodeFirst Published Jan 17, 2019, 5:15 PM IST
Highlights

కేసీఆర్ మంత్రివర్గంలో  పద్మా దేవేందర్ రెడ్డికి, ఈటల రాజేందర్‌కు మంత్రి పదవులు ఖాయమైనట్టేనని టీఆర్ఎస్ వర్గాల్లో  ప్రచారం సాగుతోంది.  స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేయడంతో ఈటల రాజేందర్‌కు కేబినెట్‌లో బెర్త్ ఖాయంగా కన్పిస్తోంది.


హైదరాబాద్: కేసీఆర్ మంత్రివర్గంలో  పద్మా దేవేందర్ రెడ్డికి, ఈటల రాజేందర్‌కు మంత్రి పదవులు ఖాయమైనట్టేనని టీఆర్ఎస్ వర్గాల్లో  ప్రచారం సాగుతోంది.  స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేయడంతో ఈటల రాజేందర్‌కు కేబినెట్‌లో బెర్త్ ఖాయంగా కన్పిస్తోంది.

తెలంగాణ  సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉంది. శాఖల పునర్వవ్యవస్థీకరణ కోసం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు ఒకే స్వభావం కలిగిన శాఖలను ఏకతాటిపైకి తెచ్చే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత కేసీఆర్ తన కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉంది.

అసెంబ్లీ సమావేశాల సమయంలోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని  కేసీఆర్ తొలుత భావించారు. కానీ శాఖల పునర్వవ్యవస్థీకరణ కారణంగా  మంత్రివర్గ విస్తరణ  వాయిదా వేసినట్టు ప్రచారం సాగుతోంది.

తెలంగాణ తొలి అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డికి కేసీఆర్ మంత్రివర్గంలో  బెర్త్ ఖాయంగా కన్పిస్తోంది. గత టర్మ్‌లో కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడ లేరు. ఈ విషయమై టీఆర్ఎస్ విమర్శలను ఎదుర్కొంది. దీంతో  మహిళల కోటా కింద ఈ దఫా కేసీఆర్ మంత్రివర్గంలో పద్మా దేవేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఖాయంగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఆలేరు నుండి గత టర్మ్‌లో విజయం సాధించిన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మరోసారి గెలుపొందారు. అయితే సునీత కూడ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకొన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో  సునీత మహేందర్ రెడ్డికి మంచి పదవి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే గత టర్మ్‌లో సునీతకు విప్ పదవిని కట్టబెట్టారు.  ఈ దఫా ఏ పదవిని కేసీఆర్ ఇస్తారనే చర్చ లేకపోలేదు.

మరో వైపు ఈ దఫా కేసీఆర్ కేబినెట్‌లో ఆశతో ఉన్న రేఖానాయక్‌ను  డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. ఈ పరిణామాలతో పద్మా దేవేందర్ రెడ్డికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు  స్పీకర్ పదవి కోసం  ఈటల రాజేందర్ పేరు కూడ విన్పించింది. ఈ విషయమై గత మాసంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సమయంలో  ఈటల రాజేందర్ కేసీఆర్‌తో ముఖాముఖి కలుసుకొని స్పీకర్ పదవి తనకు వద్దని కేసీఆర్‌కు చెప్పినట్టు సమాచారం. మంత్రి పదవి కావాలని రాజేందర్ కేసీఆర్ ను కోరారని చెబుతున్నారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్ లలో ఎవరినో ఒకరిని స్పీకర్ పదవికి ఎంపిక చేయాలని కూడ కేసీఆర్  మొదటి నుండి  భావించారు. స్పీకర్ పదవి తీసుకొనేందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి అయిష్టంగానే ఉన్నారు. అయితే గురువారం నాడు ఉదయం ప్రగతి భవన్‌లో  కేసీఆర్‌తో బేటీ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి  స్సీకర్ పదవిని తీసుకొనేందుకు అంగీకరించినట్టు చెబుతున్నారు.

కేసీఆర్ మంత్రివర్గంలో ఇంకా 16 మందికి చోటు దక్కనుంది. వీరిలో కేటీఆర్, హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, పద్మా దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలకు ఖచ్చితంగా చోటు దక్కే అవకాశం ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

స్పీకర్ పదవికి పోచారం నామినేషన్ దాఖలు

ఈటెల నో: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం?

ఈటెల నో: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం?

ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఆ ఎనిమిది మంది వీరే

ఎన్నికల ఎఫెక్ట్: ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

ఈ సారైనా ఆ నలుగురికి కేబినెట్ బెర్త్ దక్కేనా

click me!