జాతీయ పార్టీ ఏర్పాటుపై సరికొత్త ఎత్తుగడ.. ఆ రాష్ట్రాలకు పార్టీ నేతల బృందాలను పంపనున్న కేసీఆర్..?

By Sumanth KanukulaFirst Published Sep 20, 2022, 9:54 AM IST
Highlights

జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలకు పార్టీ నేతలతో కూడిన బృందాలను పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలకు పార్టీ నేతలతో కూడిన బృందాలను పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో కూడిన పలు బృందాలను.. కర్ణాటక, గుజరాత్, రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్‌లకు పంపే అవకాశం ఉంది. ఈ బృందాల ద్వారా అక్కడి రాజకీయ పరిణామాలపై అధ్యయనం చేయించనున్నారు. జాతీయ పార్టీ ప్రారంభించేందుకు సన్నద్దం కావడంలో భాగంగానే ఈ ఎత్తుగడ వేయనున్నట్టుగా తెలుస్తోంది. 

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. జాతీయ పార్టీ హోదా పొందాలంటే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం చెల్లుబాటు అయ్యే ఓట్లను పొందాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్‌కు జాతీయ హోదా వస్తేనే దేశంలో ఎక్కడైనా తమ అభ్యర్థులకు కారు గుర్తును కేటాయించేందుకు అవకాశం ఉంటుంది.

ఈ క్రమంలోనే జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో కేసీఆర్ ముందుగానే.. పలు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడంపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. 2024 స్వారత్రిక ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలను పార్టీ బృందాలను పంపేందుకు సిద్దమవుతున్నారు. 

‘‘పార్టీ టీమ్‌లలో స్థానిక ప్రజలు మరియు వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావులు ఉండాలనే సూచనలు కూడా ఉన్నాయి. తద్వారా వారు అనేక మంది వ్యక్తులను కలవగలుగుతారు. టీఆర్‌ఎస్ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల జాబితాను కూడా ఈ బృందాలను కోరే అవకాశం ఉంది’’ అని టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు చెప్పినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. 

ప్రధానంగా ఈ బృందాలు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, రాజకీయ ఆశావహులతో మాట్లాడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను వివరించి.. ఆయా రాష్ట్రాల్లో ఏయే పథకాలు, సంక్షేమ చర్యలు అవసరమో సమాచారం తెలుసుకోనున్నాయి. అనంతరం పూర్తి స్థాయి నివేదికలను కేసీఆర్‌కు అంజేయనున్నాయి. 

ఇక, చాలా కాలంగా కేసీఆర్ బహిరంగ సభలలో మాట్లాడిన సందర్భంలో.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు.. పక్క రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలను కూడా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు.. కేంద్ర ప్రభుత్వానికి కూడా స్పూర్తిగా నిలిచాయని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతాయి. టీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన రైతు బంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్, దళిత బంధు.. పథకాలు విపరీతమైన ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. 

click me!