
పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచల నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీ లో ప్రకటించారు.
దేశ ప్రయోజనాలకోసం చేపట్టిన ఈ చర్యను తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నదని తెలిపారు.
అదే సమయంలో అన్ని రూపాల్లో ఉన్న నల్ల ధనాన్ని నిర్మూలించే దిశగా భారత ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు.
ఈ ప్రక్రియ సంపూర్ణ క్రాంతిని సాధించేవరకు కొనసాగించినపుడే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయని ప్రభుత్వం బలంగా నమ్ముతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ అంశం అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న సాధకబాధకాలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో, ఆర్‌బీఐతో ఎప్పటికప్పడు సంప్రదింపులు జరుపుతున్నదని తెలిపారు.
రాష్ట్రానికి అవసరమైన సుమారు 5వేల కోట్ల రూపాయలను చిన్ననోట్ల రూపంలో పంపించవలిసిందిగా లేఖలో ఆర్ బి ఐ కి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు.
కాగా, రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహిత లావాదేవీల నియోజకవర్గంగా మలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్నారు.
ఇప్పటికే అదే నియజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని నగదు రహిత లావాదేవీల గ్రామంగా మార్చినట్లు ప్రకటించారు.