
తెలంగాణ సర్కారు మరో వివాదాస్పదన చర్య చేపట్టింది. ఈ చర్యపై రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతున్నది. రెడ్డి హాస్టల్ పునాధి పేరుతో పత్రికల్లో యాడ్స్ వెదజల్లింది తెలంగాణ సర్కారు. అది కూడా లక్ష, అర లక్ష కాదు సుమా. ఏకంగా ఐదారు కోట్ల రూపాయలు యాడ్స్ రూపంలో ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇన్ని డబ్బులు యాడ్స్ రూపంలో ఇస్తే ఆ కట్టించే హాస్టల్ కు ఎంత ఖర్చు చేస్తున్నారనే సందేహం కలగక మానదు. ఆ హాస్టల్ నిర్మాణం కోసం సర్కారు పది కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి పది కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంటే ఈలెక్క చూస్తే హాస్టల్ కోసం పది కోట్లు ఇస్తే ఆ వార్త ప్రచారం కోసం ఐదు కోట్లకు పైగా ఖర్చు చేయడం విస్మయాన్ని కలిగిస్తుందని అంటున్నారు ప్రతిపక్ష నేతలు.
తెలంగాణ సర్కారు రాజేంద్ర నగర్ లో పది ఎకరాల స్థలంలో నూతన రెడ్డి హాస్టల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే భూమి కేటాయించింది. దాంతోపాటు ఇవాళ ఉదయమే పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. పనులు ఆగమేఘాల మీద సాగిపోతున్నాయి.
పది ఎకరాల భూమితోపాటు దానిలో రకరకాల సౌకర్యాలు కల్పిస్తామంటున్నారు. బాలుర వసతి గృహం, బాలికల వసతి గృహం, కన్వెన్షన్ హాల్స్, వ్యవసాయ క్షేత్రం, కెరీర్ కోచింగ్ సెంటర్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సిఎం కెసిఆర్ చేతుల మీదుగా పునాది రాయి వేస్తున్నారు.
ప్రజా ధనాన్ని యాడ్స్ రూపంలో ఖర్చు చేయడం పట్ల పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గొర్రెలు ఇచ్చినప్పుడు, బర్రెలు ఇచ్చినప్పుడు, చేప పిల్లలు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే ప్రజాధనం ఖర్చు చేశారని అన్నారు. రెడ్డి హాస్టల్ నిర్మాణం అనేది కేవలం పేద విద్యార్థులకు మేలు చేకూర్చే అంశం ఏమాత్రం కాదని అన్నారు. ఒక టివిలో రెడ్డి కులస్తులకు వ్యతిరేకంగా అడ్డగోలు చర్చ జరిపిన నేపథ్యంలో రెడ్డి వర్గంలో నెలకొన్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని శ్రవన్ విమర్శించారు. హాస్టల్ కు ఇచ్చిన డబ్బుల కంటే ప్రచారం కోసం చేసిన ఖర్చే ఎక్కువగా ఉండడం బాధాకరమన్నారు శ్రవన్.