తెలంగాణ సచివాలయంలో ఇదేమి వాసన అబ్బా ?

First Published Aug 22, 2017, 3:12 PM IST
Highlights
  • సచివాలయంలో అదరగొట్టే వాసన
  • ముక్కులు పలిగిపోతున్నాయని ఉద్యోగుల ఆందోళన
  • సి బ్లాక్ లో మరీ కంపు కమారమే
  • సిఎం పిఆర్ఓల చాంబర్లలోనూ వాసనే

తెలంగాణ వచ్చిన తర్వాత సచివాలయం కల తప్పింది. తొలి రెండేళ్ల పాటు ఎపి సర్కారు ఇక్కడే ఉండడంతో అంతో ఇంతో హడావిడి ఉంది. కానీ ఈ ఏడాది ఎపి సచివాలయం పూర్తిగా అమరావతికి వెళ్లిపోవడం, మరోవైపు వాస్తు భయంతో తెలంగాణ సిఎం సహా మంత్రులెవరూ పెద్దగా సచివాలయంలో కనబడడం లేదు. ఈ కారణంగా పూర్తిగా నిద్రపోయినట్లుంది సచివాలయం.

ఇక ఇటీవలికాలంలో సిఎం కెసిఆర్ సచివాలయం వైపు కన్నెత్తి చూస్తలేరు. ఆయన సచివాలయానికి అసలే రాకపోవడం, మంత్రులు ఉన్నతాధికారులు కూడా అటు ప్రగతి భవన్ కు లేదా ఫామ్ హౌస్ కు చక్కర్లు కొడుతున్న తరుణంలో సచివాలయంలో హడావిడి తగ్గిపోయింది.

ఇక కీలకమైన సిఎం, మంత్రులు, ఉన్నతాధికారులు సచివాలయానికి చుట్టపుచూపుగా వస్తుండడంతో ఎలుకలే రాజ్యమేలుతున్నాయి. ఏ చాంబర్ లో చూసినా డజన్ల కొద్దీ ఎలుకలు నివాసమేర్పరచుకున్నాయి. ఇక గత రెండు మూడు రోజులుగా సచివాలయంలో ఏడెనిమిది ఎలుకలు చనిపోయి కంపు వాసన కొడుతున్నది. సిఎం పిఆర్ఓ చాంబర్ లోనే మూడు చనిపోయిన ఎలుకలను గుర్తించి బయటపడేశారు. దీంతో సి బ్లాక్ అంతా ఎలుక చచ్చిన వాసనతో దుర్గంధం వెదజల్లుతున్నది. మొత్తానికి సచివాలయ భవనాలు ఎలుకల నివాస ప్రాంగణాలుగా మారిపోయాయని పలువురు సిబ్బంది జోక్ చేస్తున్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

click me!