కేసిఆర్ కోటరీ ఇదే: ఎవరా ఐదుగురు నేతలు?

By pratap reddyFirst Published Nov 19, 2018, 2:59 PM IST
Highlights

సిఆర్ కు అత్యంత నమ్మకస్థులు ఐదుగురు ఉన్నారు. ఎల్లవేళలా కేసిఆర్ వ్యూహాలకు, ఆలోచనలకు అనుగుణంగా వారు పనిచేస్తూ ఆయనకు తోడ్పాటు అందిస్తుంటారు.

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుకు మాటల మాంత్రికుడిగా పేరుంది. మాటలతో ప్రజల తన వైపు తిప్పుకునే నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆయన వ్యూహాలు కూడా ప్రత్యర్థులను గుక్క తిప్పుకోకుండా చేస్తాయని అంటున్నారు.

అయితే, కేసిఆర్ కు అత్యంత నమ్మకస్థులు ఐదుగురు ఉన్నారు. ఎల్లవేళలా కేసిఆర్ వ్యూహాలకు, ఆలోచనలకు అనుగుణంగా వారు పనిచేస్తూ ఆయనకు తోడ్పాటు అందిస్తుంటారు.

1. హరీష్ రావు

హరీష్ రావుకు మాస్ ఫాలోయింగ్ ఉంది. కేసిఆర్ కు నమ్మకస్థుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కేసిఆర్ ను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం తన సిద్ధిపేట నియోజకవర్గంలో తను విజయం సాధించడానికే కాకుండా గజ్వెల్ లో తన మామ కేసిఆర్ ను గెలిపించే బాధ్యతను కూడా భుజాన వేసుకున్నారు. కాంగ్రెసు అభ్యర్థి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ సీటులో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి విజయానికి వ్యూహాలు రచించి, అమలు చేసేది కూడా ఆయనే. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై లెక్కాపత్రాలు చూపిస్తూ సమరం సాగిస్తున్నారు. 


2. కేటీ రామారావు

కేటీ రామారావు కేసీఆర్ తనయుడు. కేసీఆర్ తర్వాతి స్థానం అయనదే. కేసీఆర్ రాజకీయ వారసుడు కూడా ఆయనే అనే ప్రచారం ఉంది. అందుకు అనుగుణంగానే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. తండ్రి చేయాల్సిన పనులన్నీ ఆయన చేస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ల ఖరారు, అసంతృప్తుల బుజ్జగింపు, ప్రచార సారథ్యం వంటి బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. మాటకారితనంలో తండ్రి మెలుకువలను ఆయన నేర్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేని విజయం సాధించి పెట్టిన ఘనత ఆయనది. ఇతర పార్టీల ముఖ్య నేతలను టీఆర్ఎస్ లోకి తీసుకురావడంలో ఆయనది ముఖ్య పాత్ర. కేసీఆర్ యాక్షన్ టీమ్ కమాండర్ గా కేటీఆర్ ను అభివర్ణిస్తారు. 

3. జోగినిపల్లి సంతోష్ కుమార్

కేసిఆర్ మేనల్లుడు. ఆయన ఆంతరంగిక సహాయకుడు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు. టీఆర్ఎస్ ఎన్నికల వ్యవహారాలను అన్నింటినీ ఆయన చూస్తుంటారు. సంతోష్ తన దినచర్యను కేసీఆర్ లేవడం కన్నా ముందే ప్రారంభించి, కేసిఆర్ విశ్రమించిన తర్వాత ముగిస్తారు. వివిధ మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని ఆయన కేసీఆర్ కు చేరవేస్తారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహారాలను చక్కబెడుతారు. అధికారులకు, నేతలకు, కేసీఆర్ కు మధ్య ఆయన సంధానకర్తగా వ్యవహరిస్తారు. కేసీఆర్ ను ఎవరైనా కలవాలన్నా ఆయనను సంప్రదించాల్సింది. కేసీఆర్ నుంచి పార్టీ నాయకులకు, అధికారులకు ఆయనే చేరవేస్తారు. 

4. పల్లా రాజేశ్వర రెడ్డి....

పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ. విద్యార్థి దశలో వామపక్ష విద్యార్థి సంఘంలో పనిచేసిన అనుభవం ఉంది. విద్యాసంస్థల స్థాపన కారణంగా సంస్థాగత నిర్వహణల నైపుణ్యం ఉంది. దీంతో పల్లా రాజేశ్వర రెడ్డి పార్టీ సంస్థాగత వ్యవహారాలను కేసీఆర్ సూచనల మేరకు చక్కబెడుతుంటారు. బహిరంగ సభల నిర్వహణ బాధ్యతలను ఆయనే చూస్తుంటారు. కేసీఆర్ కు, జిల్లా పార్టీ నేతలకు మధ్య సమన్వయకర్తగా పనిచేస్తుంటారు. పార్టీ క్రమశిక్షణా వ్యవహారాలను కూడా ఆయన చూస్తుంటారు. 

5. వినోద్ కుమార్...

కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన వినోద్ కుమార్ గతంలో కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన కేసీఆర్ వెంటే ఉన్నారు. కేసీఆర్ ఆలోచనలను చట్టాలకు, నిబంధనలకు అనుగుణంగా ఆచరణ రూపానికి తేవడంలో ఆయన పనిచేస్తుంటారు. న్యాయపరమైన అంశాల్లో కేసీఆర్ కు సహకరిస్తుంటారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా విధానపరమైన నిర్ణయాలకు రూపకల్పన చేయడంలో ఆయన సిద్ధహస్తుడు.

Last Updated Nov 19, 2018, 2:59 PM IST