Munugode Bypoll 2022: మునుగోడుపై రంగంలోకి కేసీఆర్.. కంచర్ల కృష్ణారెడ్డితో భేటీ.. ఆ రోజే అభ్యర్థి ప్రకటన..!

By Sumanth KanukulaFirst Published Aug 13, 2022, 4:50 PM IST
Highlights

మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో టీఆర్ఎస్ అక్కడ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. అయితే నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతల అసమ్మతి రాగం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మరింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా దృష్టి సారించారు.

మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో టీఆర్ఎస్ అక్కడ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. అయితే నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతల అసమ్మతి రాగం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మరింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్ఎస్ టికెట్ కేటాయిస్తుందనే నేపథ్యంలో.. ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు టికెట్ ఆశిస్తున్నవారిలో ఒకరిగా ఉన్న కంచర్ల కృష్ణారెడ్డి.. శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. 

సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రగతి భవన్‌కు చేరుకున్న కృష్ణారెడ్డి.. దాదాపు గంటన్నరపాటు కేసీఆర్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్.. కృష్ణారెడ్డికి పలు సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మునుగోడులో ఈ నెల20వ తేదీన జరిగే టీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని కేసీఆర్ సూచించారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ ఎవరికిచ్చినా.. పార్టీ విజయం కోసం కృషి చేయాలన్నారు. 

నియోజకవర్గంలోని నేతలు మధ్య బేదాభ్రియాలు వీడాలని సూచించారు. మునుగోడు సభలోపు నల్గొండ జిల్లా నేతలతో పాటు, మునుగోడు నియోజకవర్గ నేతలతో తానే మాట్లాడతానని చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే మునుగోడులో జరిగే సభలో పార్టీ అభ్యర్థి ఎవరనేది తానే ప్రకటిస్తానని చెప్పారు. 

ఇక, మునుగోడు ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఖాయమైనట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో.. ఆయనకు వ్యతిరేకంగా పలువురు నేతలు అసమ్మతి వినిపిస్తున్నారు.  అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇటీవల నియోజకవర్గంలో కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలతో జగదీష్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం వారిని ప్రగతి భవన్‌‌కు తీసుకెళ్లారు. అయితే ప్రగతి భవన్‌ నుంచి బయటకు వచ్చిన నేతలు.. ఎవరికి టికెట్ ఇచ్చిన అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. దీంతో పరిస్థితి చక్కబడిందని అంతా భావించారు.

అయితే రెండు రోజులకే సీన్ మళ్లీ మొదటికొచ్చింది. ప్రభాకర్‌ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు కార్యకలాపాలను ముమ్మరం చేశారు. చౌటుప్పల్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం సమావేశమైన అసమ్మతి నేతలు.. ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించవద్దని టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని అభ్యర్థిస్తూ తీర్మానం కూడా చేశారు. ప్రభాకర్ రెడ్డికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. అతనికి తప్ప మిగిలిన ఎవరికైనా టికెట్ ఇచ్చిన గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని వారు చెప్పారు. ప్రభాకర్ రెడ్డి స్థానిక నేతలకు అందుబాటులో ఉండటం లేదని వారు ఆరోపించారు. ఈ పరిస్థితులు పార్టీ అదిష్టానానికి తలనొప్పిగా మారాయి. వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికను సెమీ ఫైన‌ల్‌గా భావిస్తున్న నేపథ్యంలో.. ఈ విషయంపై కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.

click me!