కుంగిన మేడిగడ్డ బ్యారేజ్‌.. డిజైన్‌లో ఏ లోపం లేదు , నెల రోజుల్లో ఆ పిల్లర్‌కు మరమ్మత్తులు : ఈఎన్సీ ప్రకటన

By Siva Kodati  |  First Published Oct 22, 2023, 9:07 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం కలకలం రేపింది . ఈ నేపథ్యంలో రామగుండం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు స్పందించారు. నెల రోజుల్లోనే మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని.. దీనిపై మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఈఎన్సీ వెల్లడించారు.  


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం కలకలం రేపింది. కేసీఆర్ మానస పుత్రికగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసే ఇంతటి కీలకమైన బ్యారేజ్‌ నిర్మాణంలో లోపాలు వెలుగుచూడటం ఎన్నికల సమయంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే బీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నాయి. వీటికి అధికార పార్టీ ధీటుగానే బదులిస్తోంది. ఈ నేపథ్యంలో రామగుండం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు స్పందించారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో కుంగిపోయిన ప్రాంతాన్ని నిపుణులు బృందం పరిశీలించిందని, 20వ నెంబర్ పిల్లర్‌ను తనిఖీ చేశారని చెప్పారు.

పిల్లర్ అడుగున్నర మేర కుంగిందని... మేడిగడ్డ ప్రాజెక్ట్ డిజైన్‌లో ఎలాంటి లోపం లేదని, ఈ ప్రాజెక్ట్‌ను ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించిందని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. నీటిని దిగువకు విడుదల చేశామని.. త్వరలోనే మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో వుంచుకుని బ్యారేజీ పరిసరాల్లో రాకపోకలను అనుమతించడం లేదని వెంకటేశ్వర్లు వెల్లడించారు. 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా బ్యారేజ్ చెక్కు చెదరలేదని ఆయన గుర్తుచేశారు. నెల రోజుల్లోనే మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని.. దీనిపై మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఈఎన్సీ వెల్లడించారు. 

Latest Videos

ఇకపోతే.. కాళేశ్వరం ఎత్తిపోతల్లోన మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కుంగింది. శనివారం రాత్రి భారీ శబ్ధంతో పిల్లర్ల మధ్య వున్న వంతెన కుంగినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు కాగా.. ఈ ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో వుందని అధికారులు పేర్కొన్నారు. బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో నీటిపారుదల ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా వున్న బ్యారేజ్ కుంగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఎల్‌ అండ్ టీ సంస్థకు చెందిన నిపుణులు కూడా బ్యారేజ్‌ వద్ద పరిస్థితిని సమీక్షించారు. 

ALso Read: మేడిగడ్డ బ్యారేజీపై కుంగిన రహదారి.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్యనిలిచిపోయిన రాకపోకలు.

అంతకుముందు ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం, నిజస్వరూపం ఇప్పుడు బయపడిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు తానే  రూపొందించానని చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని గొప్పలు చెప్పారని.. రైతులు, నాయకులకు బస్సులు పెట్టి ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లారని అన్నారు.

అయితే వరదలు వచ్చి పంపు హౌంస్‌లు మునిగినప్పుడు కాంగ్రెస్ నేతలను చూడనివ్వలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చెబుతూనే ఉందని.. ప్రాజెక్టు డొల్లతనం ఇప్పుడు బయటపడిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది సీఎం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని చెబుతూనే ఉన్నామని.. ఇప్పటికైనా కేంద్రం దీనిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.  ప్రాజెక్టు ఖర్చుకు సంబంధించి సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌తో దర్యాప్తు చేయించాలని కోరారు. కాళేశ్వరం పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

click me!