పాలేరు సీటు కోసం కాంగ్రెస్ వర్సెస్ సీపీఎం.. పొంగులేటితో కాంగ్రెస్ హైకమాండ్ చర్చ!

By Mahesh K  |  First Published Oct 22, 2023, 7:40 PM IST

కాంగ్రెస్, సీపీఎం మధ్య పాలేరు సీటు పీఠముడిగా మారింది. పాలేరు సీటు తమకే కావాలని కాంగ్రెస్ చెబుతుండగా.. లేదు లేదు తమకు కేటాయించాల్సిందేనని సీపీఎం పట్టుబడుతున్నది. పాలేరు నుంచి కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం కూడా పాలేరు నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు.
 


హైదరాబాద్: కాంగ్రెస్, వామపక్షాల పొత్తు ఇంకా ఖరారు కాలేదు. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు సీట్లు కాంగ్రెస కేటాయించే అవగాహన ఉన్నప్పటికీ ఏ స్థానాలు అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఏ స్థానం అనే విషయంపై పార్టీలు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా పాలేరు సీటును కాంగ్రెస్ వదులుకోవాలని అనుకోవడం లేదు. అదే విధంగా సీపీఎం ఈ సీటే కావాలని పట్టుబడుతున్నది. దీంతో పాలేరు సీటు పంచాయితీ హస్తినకు చేరినట్టు సమాచారం.

తెలంగాణ కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థాయి నాయకుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్‌లోకి చేరినప్పటి నుంచి పార్టీలో కొత్త హుషారు కూడా మొదలైంది. కర్ణాటక జోరును ఆయన చేరిక కొనసాగించింది. ఆయన పాలేరు స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అయితే.. వామపక్షాల పొత్తు అంశం ఈ సీటుపై సస్పెన్స్ క్రియేట్ చేసింది.

Latest Videos

undefined

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు సీటును డిమాండ్ చేస్తున్నారు. కచ్చితంగా పాలేరు తమకు ఇవ్వాల్సిందేనని నిక్కచ్చిగా తేల్చేస్తున్నట్టు సమాచారం. పాలేరు సీటు కాదంటే సీపీఎం పొత్తు నుంచి తప్పుకునే పరిస్థితీ కనిపిస్తున్నది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడినట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి చర్చిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.

Also Read: బీజేపీ టికెట్ ఇప్పిస్తామని రూ. 2 కోట్ల కుచ్చుటోపీ.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

సీపీఐ కూడా హుస్నాబాద్ సీటు కావాలని పట్టుబడుతున్నది. హుస్నాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి సీపీఐ నుంచి బరిలోకి దూకాలని భావిస్తున్నది. అయితే.. కాంగ్రెస్ పార్టీకి ఈ సీటు కీలకమైనదే. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా ఈ సీటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ కేటాయించిన సీట్లను సీపీఐ యాక్సెప్ట్ చేసినట్టుగానే కనిపిస్తున్నది. ఈ పొత్తుపై స్పష్టత వచ్చిన తర్వాతే కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేయనుంది.

click me!