మాజీ ఎంపీ వివేక్ పేరు చివరి నిమిషంలో బీజేపీ తొలి జాబితా నుంచి తొలగించినట్టు సమాచారం. చెన్నూరు సీటుకు ఆయన అభ్యంతరం చెప్పడంతో పేరును పక్కన పెట్టినట్టు తెలిసింది. ఆయన కోరిన ధర్మపురి స్థానంలో ఎస్ కుమార్ నేతను బీజేపీ ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల జాబితా గురించి గత రెండు రోజులుగా ఎదురుచూపులు సాగాయి. ఈ రోజు జాబితా విడుదలైంది. మొత్తం 55 మందితో జాబితా విడుదల అవుతుందని అనుకున్నారు. అదే అంచనా బీజేపీ వర్గాల్లోనూ ఉండింది. కానీ, ఆ జాబితా 52 మంది అభ్యర్థులకు కుదించారు. ఈ ప్రచారం నేపథ్యంలో మరో చర్చ మొదలైంది. చివరి నిమిషంలో ఆ ముగ్గురి అభ్యర్థుల పేర్లు తొలగించారని, అందులో వివేక్ కూడా ఉన్నారని చెబుతున్నారు.
బీజేపీ ముఖ్య నేతల పేర్లు తొలి జాబితాలో లేకపోవడం ఆశ్చర్యాలతో పాటు సంశయాలనూ తెచ్చింది. ఈ జాబితాలో మాజీ ఎంపీ వివేక్ పేరు లేదు. అంతేకాదు, ఆయన కోరుకున్న ధర్మపురి స్థానంలో మరొక నేతను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వివేక్ కోరుకున్నట్టు తెలిసింది. అయితే, బీజేపీ మాత్రం ఆయనను చెన్నూరు నుంచి బరిలో నిలబడాలని సూచించినట్టు సమాచారం. దానికి వివేక్ అభ్యంతరం తెలుపడంతో చివరి నిమిషంలో వివేక్ పేరును జాబితా నుంచి తొలగించినట్టు కథనాలు వస్తున్నాయి.
Also Read : పాలేరు సీటు కోసం కాంగ్రెస్ వర్సెస్ సీపీఎం.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కాంగ్రెస్ హైకమాండ్ చర్చ!
దీంతో వివేక్ పరిస్థితి ఏమిటీ? ఆయన భావి దారి ఎటు వైపు వెళ్లనుందనే చర్చ మొదలైంది. వివేక్ కోరిన ధర్మపురి సీటును ఎస్ కుమార్‌కు కేటాయించారు. దీంతో వివేక్ మరోసారి హైకమాండ్‌కు విజ్ఞప్తి చేసే అవకాశం లేకుండాపోయింది. కానీ, హైకమాండ్ మాత్రం ఆయనను చెన్నూరు నుంచి బరిలోకి దింపడానికి సర్దిచెప్పే అవకాశాలు ఉన్నాయి. వివేక్ చెన్నూరు నుంచి పోటీ చేస్తారా? లేక పెద్దపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారా? అనే చర్చ జరుగుతున్నది. లేదంటే పార్టీ నామినేటెడ్ పదవి ఇచ్చి వివేక్‌కు సర్దిచెబుతుందా? అనేది వేచి చూడాల్సి ఉన్నది. వివేక్‌కు బీజేపీ ప్రాధాన్యత ఇస్తున్నది. పార్టీ మ్యానిఫెస్టో కమిటీలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.