
Jubilee Hills Bypoll : తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో వివిధ కారణాలతో ఖాళీఅయిన నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. ఈ మేరకు బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంలో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు సిఈసి ప్రకటించారు.
దేశ ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు… ఆరోజు నుండి నామినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ అక్టోబర్ 21, నామినేషన్ల స్క్రూటినీ అక్టోబర్ 22, నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ అక్టోబర్ 24. పోలింగ్ నవంబర్ 11న జరగనుంది… పలితాలు నవంబర్ 14, 2025 లో వెలువడనున్నాయి. జూబ్లిహిల్స్ తో పాటు జార్ఖండ్, మిజోరం, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఉపఎన్నికలు జరగనున్నాయి.
భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా జూబ్లిహిల్స్ ఉపఎన్నికలను సీరియస్ గా తీసుకుంది... ఎట్టి పరిస్థితుల్లో తమ సిట్టింగ్ సీటును వదులుకోకూడదని భావిస్తోంది. అందుకోసమే తీవ్ర పోటీ ఉన్నప్పటికీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దింపుతోంది. ఈమేరకు ఇప్పటికే బిఆర్ఎస్ అధికారిక ప్రకటన చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాగంటి సునీతను జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు బిఆర్ఎస్ కొద్దిరోజుల కిందటే ప్రకటించింది. ఆమెను బరిలోకి దింపడంద్వారా సానుభూతి వర్కవుట్ అవుతుందనేది బిఆర్ఎస్ భావిస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల షెడ్యూల్ వెలువడింది... త్వరలోనే నోటిఫికేషన్ కూడా వెలువడి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది. కానీ ఇప్పటివరకు అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నదీ తేలడంలేదు. చాలామంది ఈ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు... దీంతో అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతోంది.
ఇవాళ సోమవారం లేదా రేపు మంగళవారం (అక్టోబర్ 6 లేదా 7) జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ మంతనాలు జరిపారు... అనంతరం ఏఐసీసీకి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.... వీరిలో ఎవరికి జూబ్లీహిల్స్ సీటు దక్కుతుందో చూడాలి.