
Telangana Local Body Elections : తెలంగాణ స్థానికసంస్థల ఎన్నికలకు ఓ అడ్డంకి తొలగిపోయింది... ఇప్పటికే ఈ ఎన్నికల షెడ్యూల్ వెలువడినా కోర్టు కేసుల కారణంగా జరుగుతాయో లేవో అన్న ఆందోళన కొనసాగింది. కానీ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్ల పెంపుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో తెలంగాణ హైకోర్టు నిర్ణయంపై స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంది.
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో స్థానిక సంస్థల రిజర్వేషన్ల పిటిషన్ పెండింగ్ లో ఉంది. దీంతో ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో విచారణను తిరస్కరించింది న్యాయస్థానం. ఆల్రెడీ హైకోర్టులో విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది... అక్టోబర్ 8న హైకోర్టు ఇదే అంశంపై విచారణ జరగనుంది.
తెలంగాణలో ఎంపిటిసి, జడ్పిటిసి, గ్రామ సర్పంచ్ పదవులు గత ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాయి... ప్రత్యేక అధికారుల స్థానిక సంస్థల పాలన కొనసాగుతోంది. అయితే కొంతకాలంగా స్థానికసంస్ధల ఎన్నికలను నిర్వహించి ఈ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం చూస్తోంది... కానీ అందుకు అనేక అడ్డంకులు వస్తున్నాయి. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన బిసిల రిజర్వేషన్లు పెంచడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రిజర్వేషన్ పెంపు చట్టబద్దం కాదని చాలామంది కోర్టులను ఆశ్రయించారు.
ఇలా కోర్టులో స్థానిక సంస్థల వ్యవహారం ఉండగానే తెలంగాణ ప్రభుత్వం నిర్వహణకు సిద్దమయ్యింది. ఇప్పటికే షెడ్యూల్ ను కూడా ప్రకటించింది... అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. మొదట జడ్పిటిసి, ఎంపిటిసి... తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసి ప్రకటించింది. కేవలం నెల నెలన్నరలో ఎన్నికలన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే అక్టోబర్ 8న రాష్ట్ర హైకోర్టు తీర్పునుబట్టి ఎన్నికలు ఉంటాయో లేదో తేలనుంది.