హైదరాబాద్ లో కొత్త తరహా నేరం వెలుగులోకి వచ్చింది. అమ్మాయి ఎవరైనా అబ్బాయితో రోడ్డు మీద కనిపిస్తే చాలు వీడియో తీసి ఇన్ స్టా గ్రామ్ లో ఝాముండా అనే పేజ్ లో పోస్ట్ చేసి.. వేదింపులకు గురి చేస్తున్నారు.
హైదరాబాద్ : హైదరాబాద్ లో కొత్త తరహా ఆగడాలు వెలుగు చూస్తున్నాయి. యువతులను లక్ష్యంగా చేసుకుని.. ఇన్ స్టా గ్రాం లో ఝాముండ అఫీషియల్ పేరుతో ఓ ముఠా పేట్రేగిపోతోంది. ఫిర్యాదులు అందడంతో పేజ్ నిర్వాహకుల పూర్తి డేటా ఇవ్వాలని ఇన్ స్టా గ్రామ్ కు పోలీసులు లేఖ రాశారు.
ఓ వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తూ.. రోడ్లపై ఎక్కడైనా ఓ యువతి యువకుడితో కనిపిస్తే వీడియోలు చిత్రీకరిస్తోంది ఝాముండ అఫీషియల్ పేజీ. ఈ వీడియోలు పోస్ట్ చేస్తూ ఓ వర్గం యువతులను అభ్యంతరకరంగా టార్గెట్ చేస్తోంది ఆ ముఠా. పైగా తమ కమ్యూనిటీని డ్యామేట్ చేస్తున్నారంటూ మహిళకు ట్యాగ్ లైన్ తో పోస్టు చేస్తున్నారు. రోజు రోజుకు ఝాముండ పేజ్ ఆగడాలు పేట్రేగి పోతుండడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పేజ్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు.
మునుగోడు మండలంలో కలకలం రేపుతున్న మహిళ మృతి.. పోలీసు స్టేషన్ ఎదుట గ్రామస్తులు ధర్నా..
ఇక ఝాముండ అఫీషియల్ కు ఇన్ స్టా గ్రామ్ లో 12వేల ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తం 900మంది యువకులు వీడియోలు తీసే పనిలో ఉన్నారని స్టేటస్ లో పెట్టారు అడ్మిన్ లు. వీరి ఆగడాలు తట్టుకోలేక పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఝాముండ పేజ్ మీద ఇప్పటివరకు సైబర్ క్రైంలో 3 కేసులు నమోదు అయ్యాయి. 506, 509, 354(డి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పేజ్ నిర్వాహకుల పూర్తి డేటా ఇవ్వాలని ఇన్ స్టా గ్రామ్ కు హైదరాబాద్ పోలీసులు లేఖ రాశారు.