
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు (మే 20) తెలంగాణలో పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్, కోదాడలలో పవన్ పర్యటన సాగనుంది. పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించి జనసే పార్టీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రమాదంలో మృతిచెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే రూ. 5 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేయనున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన కోసం పవన్ కల్యాణ్ రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. మెట్టుగూడ అంబేడ్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం వెళ్లనున్నారు. అక్కడ కొంగర సైదులు కుటుంబాన్ని పవన్ పరామర్శించనున్నారు. అనంతరం కోదాడ వెళ్లనున్న పవన్.. కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. పవన్ పర్యటనకు సంబంధించిన ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక, పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. జనసేన కౌలు రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కల్యాణ్.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. నేరుగా బాధిత కౌలు రైతుల కుటుంబాలకు వెళ్లి సాయం అందజేస్తున్న పవన్ కల్యాణ్.. వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.