యూకేలో కేటీఆర్ వ్యాఖ్యలు.. తెలంగాణ ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారా : రఘునందన్ రావు ఫైర్

Siva Kodati |  
Published : May 19, 2022, 04:37 PM ISTUpdated : May 19, 2022, 05:05 PM IST
యూకేలో కేటీఆర్ వ్యాఖ్యలు.. తెలంగాణ ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారా : రఘునందన్ రావు ఫైర్

సారాంశం

భారతదేశం కోణంలో నుంచి మాత్రమే తెలంగాణను చూడొద్దంటూ మంత్రి కేటీఆర్ తన యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటరిచ్చారు. తెలంగాణ ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారని అంటూ ఫైరయ్యారు

తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ (bjp) నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (raghunandan rao) . గురువారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నేరుగా డబ్బులు ఇస్తే రాష్ట్రానికి ఏం నష్టమని ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారని అంటూ రఘునందన్ రావు దుయ్యబట్టారు. దేశాన్ని కాదు తెలంగాణను చూసి పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ అంటున్నారని ఫైరయ్యారు. పంచాయితీ పనులకు కేంద్రమే నిధులు ఇస్తుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. రాజ్యసభ సీట్లను ఓపెన్ ఆక్షన్‌లో అమ్ముకున్నారని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల వనరుల కోసమే వారికి సీట్లు కేటాయిస్తున్నారని.. కేసీఆర్‌కు ఉద్యమకారులు కనిపించటం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ సీట్లు అగ్రకులాల వారికే ఇస్తున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. 

ఇకపోతే.. తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన (ktr uk tour) తొలిరోజు బిజీబిజీగా సాగింది. తొలిసారిగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి .. తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను ఇక్కడి సంస్థలకు పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ (uk india business council) ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధి బృందాలకు తెలంగాణలోని వ్యాపార వాణిజ్య అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. 

Also Read:యూకే : ఫలించిన కేటీఆర్ కృషి .. హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్న దిగ్గజ ఫార్మా సంస్థ

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. భారతదేశం కోణంలో నుంచి మాత్రమే తెలంగాణను చూడొద్దన్న కేటీఆర్, తమ రాష్ట్రంలోని వినూత్న, విప్లవాత్మక విధానాలు, అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. 

ముఖ్యంగా దేశంలోని ఇతర నగరాల్లో లేని అసలు సిసలైన కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్‌లో మాత్రమే ఉందని కేటీఆర్ తెలిపారు. ఇండియాలో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా అనేకసార్లు హైదరాబాద్ అవార్డులను అందుకున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పాటు లైఫ్ సైన్సెస్- ఫార్మా, బయో టెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ఒక హాబ్ గా మారిందని కేటీఆర్ తెలిపారు. పలు మల్టీనేషనల్ కంపెనీలు అమెరికా ఆవల తమ అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లో మాత్రమే ఏర్పాటుచేశాయన్న సంగతిని మంత్రి గుర్తుచేశారు. 

టీఎస్ ఐపాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా-లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు కోసం తీసుకువచ్చిన పాలసీలు, వాటితో ఇప్పటిదాక తెలంగాణకు వచ్చిన భారీ పెట్టుబడుల వివరాలను కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ తెలియచేశారు. తెలంగాణ రాష్ట్ర వినూత్నమైన పారిశ్రామిక పాలసీలతో పాటు పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, భూమి, నీరు, విద్యుత్ సదుపాయాలతో పాటు నాణ్యమైన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమమైన మౌలిక వసతులు, పాలసీలు, ప్రోత్సాహకాలు తెలంగాణలో ఉన్నాయన్న కేటీఆర్, తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను సాదరంగా స్వాగతిస్తున్నామన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!