సీఎం కేసీఆర్ కు పిండప్రదానం... జమ్మికుంటలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన

By Arun Kumar PFirst Published Aug 5, 2021, 2:17 PM IST
Highlights

కరీంనగర్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో జమ్మికుంటలో కాంగ్రెస్ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. 

కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో కాంగ్రెస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేళ్లు అవుతోందని... ఇప్పటివరకు ఆ దిశగా ఒక్కటంటే ఒక్క చర్య తీసుకోలేదని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. ఇందుకు నిరసనగా జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పిండ ప్రదానం చేశారు కాంగ్రెస్ నాయకులు.

 కరీంనగర్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు వాగ్దానం కార్యరూపం దాల్చలేదంటూ జమ్మికుంట కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై బైటాయించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా ఇరువురి మధ్య తోపులాట జరిగింది. 

read more  తీన్మార్ మల్లన్నకు నోటీసులు.. కేసీఆర్ కు రాజకీయ సమాధి కడతానంటూ హెచ్చరిక..

ఇదిలావుంటే కేవలం హుజురాబాద్ కే పరిమితం చేయకుండా దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధు కోసం ఏకగ్రీవ తీర్మానం చేయాలని, నిధులు లేకపోతే.. ప్రగతిభవన్‌, సచివాలయం భూములను అమ్మైనా దళితబంధు అమలు చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో గిరిజనులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ.. పోడు భూములను లాక్కుంటున్నారని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. కేసీఆర్‌ గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ.. దళిత, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులపై ప్రేమ ఉండి కాదని.. కేవలం హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే దళితబంధు పథకం తెచ్చారని రేవంత్ ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేసిన నిధులు ఎంతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దళిత, గిరిజన హక్కుల కోసం ఆగస్టు 9న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించబోతున్నామని రేవంత్ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో లక్షమందితో దళిత గిరిజన దండోరా నిర్వహించి ‘ఇస్తావా..చస్తావా’ అనే నినాదంతో పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దళిత బంధు అమలు చేయకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.  

click me!