జలమండలి జిఎంకు 50 వేల లంచం ఇచ్చాడు గుత్తేదారు మైసయ్య. వెంటనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా జిఎం ను పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ : లంచం తీసుకుంటూ పట్టుబడిన వాటర్ బోర్డు అధికారికి ఏసీబీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడడంతో ఈ కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. మూడేళ్ల జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. ఈ తీర్పు శుక్రవారం నాడు వెలువడింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ తార్నాక మాణికేశ్వర్ నగర్ లో ఉంటున్న బొంత మైసయ్య అనే వ్యక్తి వాటర్ బోర్డు కాంట్రాక్టర్ గా పనులు చేస్తుంటాడు.
జలమండలికి చెందిన ఆపరేషన్ అండ్ మెయిన్టెనెన్స్ డివిజన్ 14లో లీకేజీ మరమ్మత్తులను కాంట్రాక్టు తీసుకుంటుంటాడు. 2010లో జలమండలి డివిజన్ 14కు జిఎంగా ఉన్న రత్లావత్ లోకిలాల్ ఉండేవాడు. ఆయన గుత్తేదారు మైసయ్యకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, అంత డబ్బు తన దగ్గర లేదని మైసయ్య చెప్పినా కూడా రత్లావత్ వినలేదు. లంచం ఇవ్వకపోతే బిల్లులు పాస్ చేయనంటూ.. తర్వాత నీ ఇష్టం అంటూ బ్లాక్మెయిల్ చేశాడు.
వైఎస్ఆర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు: బాబుతో భేటీ తర్వాత షర్మిల
అయితే మైసయ్య అతను అడిగిన మొత్తం ఇచ్చుకోలేనని కొంచెం తగ్గించాలని కోరాడు. దీనికి కూడా రత్లావత్ ఒప్పుకోలేదు. దీంతో డబ్బులు ఇవ్వడానికి మైసయ్య ఒప్పుకున్నాడు. కానీ తాను ఎంత అడిగినా రత్లావత్ తగ్గకుండా, ఇబ్బంది పెడుతుండడంతో విసిగిపోయిన మైసయ్య ఏసీబీ అధికారులకు విషయం చెప్పాడు. వారి సహకారంతో పక్కా ప్లాన్ తో జిఎంకు 50 వేల లంచం ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా జిఎం ను పట్టుకున్నారు.
కేసు నమోదు చేశారు. కోర్టులో సమర్పించారు. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మహమ్మద్ అఫ్రోచ్ అక్బర్ జిఎం రత్లావత్ కు మూడేళ్ల జైలు శిక్ష, 15వేల జరిమానా విధిస్తూ శుక్రవారం నాడు తీర్పునిచ్చింది.