
రాహూల్ గాంధి తెలంగాణా పర్యటన విజయవంతమైనట్లే ఉంది. చాలాకాలం తర్వాత తెలంగాణాలో అడుగుపెట్టిన రాహూల్ గాంధి నేరుగా రెండు అంశాలను స్పష్టంగా టచ్ చేసారు. ఒకటి, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, కెసిఆర్ కుటుంబం చెలాయిస్తున్న అధికారాలను కాగా రెండో అంశం రైతుల సమస్యలు.
సంగారెడ్డిలో గురువారం పిసిసి ఆధ్వర్యంలో జరిగిన ‘ప్రజాగర్జన’ లో రాహూల్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఒకందుకు తెలంగాణా రాష్ట్రాన్ని ఇస్తే పరిస్ధితి ఇంకో విధంగా మారిపోయిందంటూ మండిపడ్డారు. హక్కుల కోసం తెలంగాణా ప్రజలు పోరాటాలు చేస్తే, ఆ పోరాటం చివరకు నలుగురి కోసమే అన్నట్లు తయారైందని వ్యంగ్యంగా అన్నారు.
ప్రజల అభీష్టాన్ని అర్ధం చేసుకుని తమ పార్టీ తెలంగాణా ఇచ్చిందన్నారు. ప్రజల పోరాటం సాకారమైందా అంటూ జనాలను ఉద్దేశించి రాహూల్ ప్రసంగించినపుడు పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. మూడేళ్ళల్లో తెలంగాణా అభివృద్ధి జరిగిందా అంటూ రాహూల్ వేసిన ప్రశ్నకు లేదంటూ సమాధానం రావటం గమనార్హం. కెసిఆర్ కేవలం కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణా శక్తి, వనరులు ఒకే కుటుంబం చేతిలో బందీ అయిందంటూ మండిపడ్డారు. అధికారాలు మొత్తం ఒకే కుటుంబం చెలాయిస్తోందని మండిపడ్డారు. కెసిఆర్ బంగారు తెలంగాణా నినాదాన్ని కూడా రాహూల్ ఎద్దేవా చేసారు. తెలంగాణా రైతులకు బ్యాంకులు రుణాలను ఎందుకు ఇవ్వటం లేదో ఒకసారి ఆలోచించాలన్నారు.
గడచిన మూడేళ్ళల్లో తెలంగాణా మొత్తం మీద 2855 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క సిఎం నియోజకవర్గంలోనే 100 మంది చనిపోవటం బాధాకరమన్నారు.
తమ హయాంలో రూ. 75 వేలకోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన విషయాన్ని రాహూల్ గుర్తుచేసారు. నిజంగానే ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేస్తే వారి పాసుపుస్తకాలు, బంగారం ఇంకా బ్యాంకుల్లోనే ఎందుకున్నాయంటూ ప్రశ్నించారు. గిట్టుబాటు ధరలడిగిన రైతుల చేతులకు ప్రభుత్వం సంకెళ్ళు వేయటం నిజంగా బాధాకరమని రాహూల్ వాపోయారు.