
తెలంగాణాలో మూడేళ్లుగా తేలందొకటుంది. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనేది అది. ప్రభుత్వం ఇంతవరకు ఎన్నో విషయాలు చెప్పింది. ఈ విషయం మాత్రం చెప్పలేకపోతున్నది. ఉద్యోగాల లెక్క పూటపూటకు మారుతుంది. ఇంతవరకు ఒక్క సంఖ్య అధికారికంగా నిజం అని తేలలేదు. ప్రభుత్వం ఎన్నిసార్లు ఈ అంకెలను మార్చిందో లేక్కేలేదు.
తెలంగాణ ప్రభుత్వం కాకిలెక్కల ఖజానాగా మారిపోయిందంటున్నారు నిరుద్యోగులు. ప్రభుత్వం ఇపుడు ఏమి చెప్పినా నమ్మే స్థితిలో లేరు. ఇపుడు తాజాగా ప్రకటించిన 20 వేల ఉద్యోగాలకు ఇదే గతి పట్టింది.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటన అంటే ఇంచు మించు శిలాశాసనం లాంటిదే. వాస్తవం అలాలేదు. దానికి నిదర్శనం ఇది.
మే నెల 30వ తేదీన ప్రగతి భవన్ లో విద్యాశాఖపై ఒక సమీక్షా సమావేశం జరిగింది. సిఎం, మంత్రి కడియం, ఘంటా చక్రపాని కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నరు. తర్వాత సిఎం కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో మొత్తం 20వేల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో కాలేజీలు, ప్రభుత్వ శాఖల్లో ...2,437 పోస్టులు, కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో 1428 ,అర్బన్ రెసిడెన్సియల్ పాఠశాలల్లో 377 అన్నారు. వీటికి తోడు డిఎస్సీ ద్వారా 8,792 పోస్టులు నింపుతున్నట్లు చెప్పారు.
ఇంతవరకు బాగానే ఉంది. ఈ పోస్టులన్నీ కలిపితే వచ్చేవి 13,034 మాత్రమే. మరి 20వేలు ఎలావచ్చాయి?
వీటితోపాటు ఎప్పుడో జమానాలో రెండుసార్లు నోటిఫికేషన్ జారీ చేసి బుధవారం పరీక్ష జరిగిన గురుకుల టీచర్ పోస్టుల సంఖ్య 7,300 పోస్టులను కూడా కలిపి లెక్కించి 20వేల పై చిలుకు పోస్టులు భర్తీ అని అనేశారు.అసలే ఉద్యోగాల్లేక డీలా పడి ఉన్న నిరుద్యోగులను ఇది మరింత క్రుంగ దీస్తున్నది.
ఇంకా నయం వీటితోపాటు కానిస్టేబుల్ పోస్టులు, ఎస్సై పోస్టులు, విద్యుత్ శాఖలో ప్రకటించిన పోస్టులను కూడా కలిపి వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ అని ప్రకటించి ఉంటే...
ఒకవేళ ఈ ప్రకటన సిఎం, మంత్రి కడియం, ఘంటా చక్రపాణి ఆమోదంతో వెలువడి ఉంటే సిఎం ఆఫీసు మాత్రమే కాకుండా ఈ సర్కారే మూకుమ్మడిగా నిరుద్యోగులను మాయా ప్రకటనలతో మోసం చేస్తున్నట్లు అనుకోవాల్సిందే.
ఎందుకంటే... అటువైపు ఆంధ్రాలో డిఎస్సీ నిర్వహించి 9వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేసిన తరుణంలో ఒక్క టీచర్ పోస్టు కూడా తెలంగాణలో భర్తీ చేయకుండా ఇక్కడి సర్కారు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. డిఎస్సీ విషయంలో ముందుగా 15 నుంచి 20వేల పోస్టులు నింపుతమన్నరు. తర్వాత 12వేలకు పడిపోగా... ఆ తర్వాత 8వేల చిల్లర పోస్టులకు పడిపోయింది సంఖ్య. ఇప్పటికైనా ఇలా మభ్యపెట్టే ప్రకటనలు మానుకోవాలని విద్యార్థులు,యువకులు కోరుతున్నారు.