
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కార్యకలాపాలు, పార్టీకి సంబంధించి ఇతర నేతల స్పందన చూస్తుంటే కవిత పార్టీకి దూరమవుతున్నారా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా కవిత ఆధ్వర్యంలో జాగృతి సంస్థ నిర్వహించిన మహా ధర్నాలో బీఆర్‌ఎస్ నేతలు పాల్గొనకపోవడం, రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది.
ఇందిరా పార్క్‌లో జరిగిన ఈ ధర్నా కేసీఆర్‌కు కాళేశ్వరం కేసులో వచ్చిన కమిషన్ నోటీసులపై నిరసనగా జరిగింది. కానీ ఈ కార్యక్రమానికి కేవలం కవిత అనుచరులు, జాగృతి కార్యకర్తలే హాజరయ్యారు. గులాబీ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు ఎవరూ అటెండ్ కాలేదు. అంతకుముందు కవిత పలు జిల్లాల్లో చేసిన పర్యటనల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.
కవిత ఒక లేఖ ద్వారా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలపై పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తింది. అయితే ఈ లేఖ లీక్ కావడాన్ని కవిత తీవ్రంగా స్పందించారు. లీక్ చేసినవారు ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేయడమే కాక, పరోక్షంగా కేటీఆర్‌ను టార్గెట్ చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత తీరుపై పార్టీ నేతలు సైతం వ్యతిరేకంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఓవైపు కేసీఆర్‌ను దేవుడు అంటూనే, అతనొక్కడే నాయకుడు అంటూనే మరోవైపు పార్టీని విమర్శించడం పలువురిని విస్మయానికి గురి చేసింది. పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన సూచనలు లేకపోవడంతో నేతలు కవిత మహాధర్నాకు దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే సమయంలో కొందరు నేతలు మాత్రం, కేసీఆర్ కు మద్దతుగా ఉన్న కార్యక్రమానికి అడ్డంకులు ఎందుకు పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే పార్టీ అంతర్గతంగా రెండు వర్గాలుగా విడిపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. కవిత బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తన అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. జాగృతి వేదికగా పార్టీకి సంబంధించిన విషయాల్లో స్వతంత్రంగా స్పందించడం ద్వారా ఆమె వ్యూహాన్ని చెప్పకనే చెబుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.